7 వికెట్లు తీసిన బెంగాల్ స్పిన్నర్
రైల్వేస్‌పై ఇన్నింగ్స్ 120 పరుగులతో బెంగాల్ జయభేరి
రంజీ ట్రోఫీ రౌండప్
సూరత్: బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో బెంగాల్ ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో రైల్వేస్‌పై ఘనవిజయం సాధించింది. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ స్పిన్నర్ షహబాజ్ అహ్మద్ (7/56) రైల్వేస్ రెండో ఇన్నింగ్స్‌ను కూల్చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను (తొలి ఇన్నింగ్స్ వికెట్) మొత్తం 8 వికెట్లు తీశాడు. చివరి రోజు 90/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన రైల్వేస్ జట్టు 55.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది.
షహబాజ్ స్పిన్ ఉచ్చు బిగించడంతో చేతిలో ఉన్న సగం వికెట్లతో ఆఖరి రోజు కనీసం ఒక సెషన్‌ను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. క్రితం రోజు స్కోరుకు 42 పరుగులు మాత్రమే జోడించి 5 వికెట్లను కోల్పోయింది. ఈ ఐదు వికెట్లు షహబాజే పడగొట్టడం విశేషం!
ఓవర్‌నైట్ బ్యాటర్లు భార్గవ్ (26; 2 ఫోర్లు), ఉపేంద్ర యాదవ్ (21; 2 ఫోర్లు) ఎంతోసేపు నిలువలేకపోయారు. వీళ్లిద్దరితో పాటు కరణ్ శర్మ (6), ఆకాశ్ పాండే (18; 2 సిక్స్‌లు), కునాల్ యాదవ్ (0)లను కూడా షహబాజ్ పెవిలియన్ చేర్చాడు.
మధ్యప్రదేశ్ గెలుపు
పొర్వొరిమ్: గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 3 వికెట్ల తేడాతో గోవాపై గెలుపొందింది. 328 పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా ఆఖరి రోజు మంగళవారం 21/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన మధ్య ప్రదేశ్ 94 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసి గెలిచింది.
ఆట మొదలైన కాసేపటికే హిమాన్షు మంత్రి (22; 3 ఫోర్లు) నిష్క్రమించినప్పటికీ... మరో ఓవర్‌నైట్ బ్యాటర్ హర్‡్ష గావ్లీ (54; 6 ఫోర్లు), కెప్టెన్ శుభమ్ శర్మ (72; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు.
తర్వాత హర్‌ప్రీత్ సింగ్ (35; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సారాంశ్ జైన్ (82; 9 ఫోర్లు)లు సైతం విలువైన భాగస్వామ్యాలు జత చేయడంతో మధ్యప్రదేశ్ విజయం సాధించింది. గోవా బౌలర్లలో లలిత్ యాదవ్, దర్శన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో మధ్య ప్రదేశ్ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి.
త్రిపుర, అస్సాం మ్యాచ్ డ్రా
అగర్తలా: గ్రూప్ ‘సి’లో త్రిపుర, అస్సాం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే చేతిలో ఉన్న 7 వికెట్లతో ఇంకా 286 పరుగులు చేయాల్సిన దశలో అస్సామ్ బ్యాటర్లు పోరాడారు. ఫాలోఆన్‌లో 78/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన అస్సాం 117.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. కెప్టెన్ , ఓవర్‌నైట్ బ్యాటర్ దేనిశ్ దాస్ (103; 14 ఫోర్లు), సుమిత్ ఘడిగాంకర్ (54; 5 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 150 పరుగులు జతచేశారు.
ఈ క్రమంలో దాస్ సెంచరీ, సుమిత్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత శిబ్‌శంకర్ రాయ్ (101 నాటౌట్; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అజేయ శతకంతో అస్సాంను డ్రాతో గట్టెక్కించాడు. రోజంతా బౌలింగ్ చేసిన త్రిపుర బౌలర్లు కేవలం 4 వికెట్లే తీయగలిగారు. త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 602/7 (డిక్లేర్డ్) స్కోరు చేసింది. హనుమ విహారి శతక్కొట్టాడు. ఈ సీజన్‌లో అతను వరుసగా రెండో సెంచరీ సాధించాడు.


