సోషల్‌ మీడియాలో పోలీసు హీరో

Brave Indian Cops Saved The Poor Image of Police - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో గంగాదీప్‌ సింగ్‌ అనే సబ్‌ ఇనిస్పెక్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా హీరో అయ్యారు. కొంత మంది హిందూ మతతత్వవాదులు ఓ ముస్లిం యువకుడితో గొడవ పడి అతన్ని చితక్కొట్టబోతే సకాలంలో అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి సింగ్‌ అతనికి తన శరీరాన్ని రక్షణ కవచంలా అడ్డేసి రక్షించారు. ఓ పక్కన ఆ ముస్లిం యువకుడిని కొట్టేందుకు ప్రయత్నిస్తున్న అల్లరి మూకకు నచ్చ చెబుతూనే బాధితుడికి అంగరక్షకుడిలా నిలిచారు. ఇతర పోలీసుల్లాగా పోలీసు బలగాలు వచ్చే వరకు అతను నిరీక్షించలేదు.  ఉద్రిక్త పరిస్థితి గురించి తెల్సిన వెంటనే పరుగుపరుగున అక్కడికి వచ్చారు.  ఈ సంఘటనకు సంబం«ధించి ఎవరో శుక్రవారం తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై నిర్ధాక్షిణ్యంగా పోలీసులు కాల్పులు జరపడం, ఆ సంఘటనలో 13 మంది చనిపోవడం లాంటి సంఘటనలు విన్నప్పుడు పోలీసులు అంత దుర్మార్గులు మరొకరు ఉండరని అనిపిస్తుంది. గంగాదీప్‌ సింగ్‌ లాంటి వారిని చూసినప్పుడు పోలీసుల్లో కూడా మహానుభావులు ఉంటారనిపిస్తోంది. ఇలాంటి మహానుభావులు అరుదుగానే కనిపిస్తారు. ముంబైలోని కమలా మిల్స్‌ కాంప్లెక్స్‌లో కొంతకాలం క్రితం అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వోర్లీ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సుదర్శన్‌ షిండే అనే పోలీసు కానిస్టేబుల్‌ తన ప్రాణాలకు తెగించి తన భుజాల మీదుగా బాధితులను మోసుకురావడం వల్ల ఎనిమిది మంది ప్రాణాలను కాపాడారు. నాటి అగ్ని ప్రమాదంలో 14 మంది మరణించారు. 

కేరళలోని తిరువనంతపురంలో ఏఎస్‌ఐ సాజిష్‌ కుమార్‌ నదిలోకి దూకి మునిగిపోతున్న టీనేజర్‌ను రక్షించారు. అలాగే నాసిక్‌లో కుంభమేళ సందర్భంగా నీటిలో మునిగిపోతున్న ఓ మనిషిని రక్షించేందుకు మనోజ్‌ భారతే అనే పోలీసు అధికారి ఏకంగా 20 అడుగుల వంతెనపై నుంచి దూకారు. వాస్తవానికి పోలీసులు సామాజిక సేవకులుగానే ఉండాలి. కానీ రాజకీయ అవినీతి వల్ల వారు చెడిపోతున్నారు. నియామకాల్లో, బదిలీల్లో భారీ అవినీతి జరగడమే అందుకు కారణం. అవినీతిని నిర్మూలించడంతో పాటు సామాజిక సేవారంగంలో పోలీసులకు తగిన శిక్షణ కల్పించినప్పుడు, వారిలో సేవా దృక్పథాన్ని పెంచేందుకు సామాజిక శాస్త్రవేత్తల సేవలను వినియోగించినప్పుడు పోలీసుల్లో మహానుభావుల సంఖ్య పెరుగుతుంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top