నగరంలో రాజకీయ బ్యానర్లు, హోర్డింగ్‌లను బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తొలగించే పనులు చేపట్టింది.
సాక్షి, ముంబై : నగరంలో రాజకీయ బ్యానర్లు, హోర్డింగ్‌లను బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తొలగించే పనులు చేపట్టింది. నూతన ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలుపుతూ నగరంలోని చాలా ప్రాంతాల్లో వేలాది బ్యానర్లు, పోస్టర్లను అక్రమంగా ఏర్పాటు చేశారు.
దీంతో వీటి తొలగింపునకు బీఎంసీ ఉపక్రమించింది. బీఎంసీ అధికారుల కథనం ప్రకారం.. వ్యక్తిగత, రాజకీయ పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేయడానికి 2013 సెప్టెంబర్‌లో బీఎంసీ ఓ విధానాన్ని రూపొందించింది. ఈ మేరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, స్వాగత హోర్డింగ్‌లు, రాజకీయ, వ్యక్తిగత పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటుకు బీఎంసీ అనుమతించింది. అయితే వాటి పరిమాణం కేవలం 10 గీ 10 అడుగులు మాత్రమే ఉండాలనే నిబంధన విధించింది.
అలాగే వాటిని ఒక్కరోజు మాత్రమే ఉంచేందుకు అనుమతించింది. ఆ తర్వాత కూడా సదరు బ్యానర్లు, హోర్డింగ్‌లను అలాగే వదిలేస్తే బాధ్యులపై బీఎంసీ చర్యలు తీసుకోవచ్చు. వారికి రూ.1,000 నుంచి రూ.2 వేల వరకు జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష విధించేందుకు అవకాశముంది.