రాజస్థాన్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రసంగం చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ శుక్రవారం ఫిర్యాదు చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రసంగం చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. చురు, అల్వార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగాలను ప్రచురించిన వివిధ పత్రికల క్లిప్పింగ్‌లు, పలు చానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్‌లతో కలిపిన ఫిర్యాదు పత్రాన్ని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఎన్నికల సెల్ జాతీయ కన్వీనర్ ఆర్.రామకృష్ణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వి.ఎస్.సంపత్, కమిషనర్‌లు హెచ్.ఎస్.బ్రహ్మ, నసిం జయాదిలకు అందచేశారు.
ఓట్లను రాబట్టడానికి మతపరమైన భావోద్వేగాలను రాహుల్ రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ముజఫర్‌నగర్ మతఘర్షణలపై నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించిన రాహుల్, కాంగ్రెస్ పార్టీలకు సంజాయిషీ నోటీసు జారీ చేయాలని విన్నవించారు. కాగా, ఇండోర్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ జైదీప్ గోవింద్ ఆదేశాలిచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర సింగ్ తోమార్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణకు ఇండోర్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చామని తెలిపారు.