
అసలు సిసలైన పొలిటికల్ థ్రిల్లర్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పొలిటికల్ థ్రిల్లర్‌లా సాగాయి. ముందస్తు అంచనాలను తలకిందులు చేశాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పొలిటికల్ థ్రిల్లర్‌లా సాగాయి. ముందస్తు అంచనాలను తలకిందులు చేశాయి. తుదితీర్పు ప్రజల మనోగతానికి అద్దం పట్టింది. సచ్ఛీలత, సుస్థిరత, సుపరిపాలనలకు పట్టం గట్టాయి. అసహనానికి సహనం నూరిపోశాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి మధ్య హోరాహోరీగా జరిగిన ప్రచారం.. ఫలితాల్లో కూడా ప్రతిఫలిస్తుందని ఒకటి, రెండు మినహా అన్ని సర్వేలు చాటి చెప్పాయి. అయితే, ఒకటి రెండు సంస్థలు తప్ప దాదాపు సర్వేలన్నీ కూడా రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని, ఫలితాల్లో కూడా రెండు కూటములు దగ్గరగానే ఉంటాయి గానీ మహాకూటమి స్వల్ప ఆధిక్యంతో అధికారం చేపడుతుందని చెప్పాయి. అది మాత్రం తప్పయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నూటికి పైగా స్థానాలు గెలుచుకుంటుందని చెప్పినా, ఆ దరిదాపుల్లోకి చేరుకునే పరిస్థితి కూడా ఏ దశలోనూ కనిపించలేదు.
దాదాపు అన్ని వర్గాల ప్రజలు నితీష్ నాయకత్వాన్ని, లాలు అండదండలను కోరుకున్నారనే విషయం తీర్పుతో స్పష్టమైంది. యాదవులు, ముస్లింలు ఎక్కువగా ఉన్న సీమాంచల్‌లో దాదాపు 75 శాతం ఓట్లు మహా కూటమికి పడ్డాయి. మొత్తం 70 శాతానికి పైగా బీసీలు, ఓబీసీలు మహాకూటమికే ఓటేశారని ఫలితాల తీరు తెలియజేస్తోంది. 80 శాతం వరకు ముస్లింలు, 45 శాతం మహిళలు, 41 శాతం యువకులు మహా కూటమికే మద్దతు పలికారు.
దాద్రీ నుంచి ఢిల్లీ వరకు పెరిగిపోయిన అసహన సంఘటనలు బీజేపీ కూటమిపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. నమ్ముకున్న అగ్రవర్ణాలు, యువత, కొత్త ఓటర్ల నుంచి కూడా ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. అభివృద్ధి మంత్రం పేరిట ఆర్థికంగా వెనకబడిన వివిధ వర్గాలను తమవైపు తిప్పుకోడానికి ప్రధాని మోదీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తొలుత అటూ ఇటూ ఊగిసలాడిన ఈబీసీలు కూడా చివరకు సుస్థిర పాలన నినాదానికే కట్టుబడి ఓటేశారు. ఒకప్పుడు భూస్వాముల ప్రైవేటు సైన్యం హింసాకాండలో నలిగిపోయిన కులాలు కూడా సుస్థిర పరిపాలనకే మొగ్గుచూపాయి.
హిందూ అతివాద శక్తుల ఎజెండాను వ్యతిరేకిస్తున్న ఉదారవాదులు, హేతువాదులు, సామ్యవాదులు కూడా కలసికట్టుగా నితీస్ కూటమివైపే నిలబడ్డారు. వామపక్షాల కూటమి ఎన్నికల బరిలో ఉన్నా.. పెద్దగా ప్రభావం చూపలేదు. దళిత వర్గానికే చెందిన జితన్ రామ్ మాంఝీ సొంత పార్టీ పెట్టి ఏకంగా 40 సీట్లకు పోటీచేసినా నితీష్ కూటమి విజయపథాన్ని అడ్డుకోలేకపోయారు. మహాదళితులు ఓట్లు ఆయన చీల్చుకు రాగలరని, దాంతో ఫలితాలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఉంటాయని భావించారు గానీ అలా జరగలేదు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనకు ఇది రిఫరెండం అయినా, కాకపోయినా ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠను మాత్రం బిహార్ ఎన్నికల ఫలితాలు దెబ్బతీశాయి. కేంద్రంలో ప్రతిపక్షాల పునరుజ్జీవనానికి బిహార్ ఎన్నికల తీర్పు దోహదపడుతుందని చెప్పవచ్చు.