బ్యాంకు చార్జీలకే 10వేల కోట్లు | Sakshi
Sakshi News home page

బ్యాంకు చార్జీలకే 10వేల కోట్లు

Published Sun, Dec 23 2018 4:17 AM

Banks collected over Rs 10000 crore from customers - Sakshi

పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకపోవడం, పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీలు నిర్వహించడం వల్ల బ్యాంకులు ఖాతాదారుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసిన మొత్తం అక్షరాలా రూ.పది వేల కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత మూడున్నరేళ్లలో ఖాతాదారుల నుంచి ఈ సొమ్ము వసూలు చేశాయని, అయితే, ప్రైవేటు బ్యాంకులు ఇంకా భారీగానే రాబట్టి ఉంటాయని పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. కనీస నిల్వ నిబంధనను ఎస్‌బీఐ 2012వ సంవత్సరంలో ఆపివేసింది. 2017 ఏప్రిల్‌ నుంచి మళ్లీ వసూలు చేయడం మొదలు పెట్టింది. మిగతా బ్యాంకులు కూడా అదేబాటను అనుసరిస్తున్నాయి.

ఈ పదివేల కోట్లలో ఖాతాదారు అకౌంట్‌లో కనీస నిల్వ లేనందుకు రూ.6,246 కోట్లు, పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలు జరిపినందుకు రూ.4,145 కోట్లు వసూలు చేశాయి. ఇందులో ఎస్‌బీఐ వాటా.. కనీస నిల్వకు సంబంధించి రూ.2,894 కోట్లు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రూ.1,554 కోట్లు. జన్‌థన్‌ ఖాతాలకు, బేసిక్‌ పొదుపు ఖాతాలకు కనీస నిల్వ పరిమితి లేదు. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి మెట్రో నగరాల్లో          నెలకు మూడు లావాదేవీలు(ఇతర బ్యాంకు ఏటీఎంలలో), మిగతా చోట్ల ఐదు లావాదేవీలు ఉచితం. ఈ పరిమితి దాటితే కనీసం రూ.20 చొప్పున ప్రతి లావాదేవీకి వసూలు చేస్తున్నాయి. ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలలో ఉచిత లావాదేవీలు ఐదు వరకు చేసుకోవచ్చు. 

Advertisement
Advertisement