బ్యాంకింగ్, టెలికాం, రైల్వేల్లో ఇక ఒకే టైమ్‌!

banking, railways, telecome maintain on pertuculer time - Sakshi

రూ.100 కోట్లతో త్వరలో ప్రాజెక్టు ప్రారంభం.. కీలక మార్పులకు అవకాశం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఒకే ప్రామాణిక సమయాన్ని అమల్లోకి తేవడానికి కేంద్రం త్వరలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం. ఇది ఆచరణకు నోచుకుంటే ఒకే ప్రామాణిక సమయంతో పాటు మరింత కచ్చితత్వంతో కూడిన సమయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల బ్యాంకింగ్, టెలికాం, వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ, రైల్వే ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ తదితర రంగాల్లో ఏకరూపత రావడంతో పాటు పలు ఇతర కీలక మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు ప్రాంతీయ రెఫరెన్స్‌ స్టాండర్డ్స్‌ లేబొరేటరీ(ఆర్‌ఆర్‌ఎస్‌ఎల్‌)ల మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు అలాంటివి మరో రెండింటిని నెలకొల్పుతారు. అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, ఫరీదాబాద్, గువాహటిల్లో ఉన్న ల్యాబ్‌ల బలోపేతానికి నేషనల్‌ ఫిజికల్‌ లేబొరేటరీ(ఎన్‌పీఎల్‌) సాయం తీసుకుంటారు.

జాతీయ భద్రతకే..: దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లు, కంప్యూటర్లను ఒకే జాతీయ గడియారంతో అనుసంధానించడం తప్పనిసరని వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వేర్వేరు రంగాల్లో వేర్వేరు ప్రామాణిక సమయాలు అమల్లో ఉండటం వల్ల సైబర్‌ నేరాల విచారణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వ్యూహాత్మక ప్రణాళికలు, జాతీయ భద్రత నిమిత్తం ఈ మేరకు మార్పులు జరగాలని అన్నారు. ఒకే ప్రామాణిక సమయంతో మొబైల్‌ ఫోన్‌ బిల్లులు కూడా తగ్గుతాయని ఆ శాఖ కార్యదర్శి అవినాశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదించిన రూ.100 కోట్లలో ఈ ఏడాది బడ్జెట్‌లోనే రూ.20 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. టెలికాం, ఇంటర్నెట్‌ సేవలందిస్తున్న సంస్థలు ఒకే ప్రామాణిక సమయాన్ని పాటించడం లేదని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్యదర్శుల బృందం లోగడే తేల్చింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top