యూపీఏ వల్లే బ్యాంకింగ్‌ సంక్షోభం | Banking crisis because of upa : modi | Sakshi
Sakshi News home page

యూపీఏ వల్లే బ్యాంకింగ్‌ సంక్షోభం

Dec 14 2017 2:06 AM | Updated on Aug 15 2018 2:32 PM

Banking crisis because of upa : modi - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ సంక్షోభానికి యూపీఏనే కారణమని ప్రధాని మోదీ  ఆరోపించారు. నచ్చిన వారికి రుణాలిప్పించేందుకు బ్యాంకులపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.  2జీ, బొగ్గు, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణాల కన్నా ఇది చాలా పెద్దదని మోదీ విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 90వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ), మొండి బకాయిల సమస్యలను గత ప్రభుత్వంలోని ఆర్థికవేత్తలు మాకు అందించారు’ అని అన్నారు. ‘పార్టీకి సన్నిహితంగా ఉండే వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు భారీగా రుణాలిప్పించారు. యూపీఏ హయాంలోని అతిపెద్ద కుంభకోణం ఇది’ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.

తప్పు చేస్తున్నారని అందరికీ తెలుసు
‘బ్యాంకుల ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితికి గత ప్రభుత్వ విధానాలు ఎలా కారణమయ్యాయనే దానిపై ఫిక్కీ వంటి సంస్థలు అధ్యయనం చేయలేదు. ప్రభుత్వం, బ్యాంకులు, మార్కెట్‌లు, పరిశ్రమల్లో ఉన్న వారందరికీ యూపీఏ చేస్తున్న తప్పులు తెలుసు. పారిశ్రామికవేత్తలను అడ్డంపెట్టుకుని ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు లూటీ చేశారు’ అని విమర్శించారు. పారిశ్రామిక రంగం డిమాండ్‌ చేస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తీసుకొచ్చామన్నారు. యాంటీ –ప్రాఫిటీరింగ్‌ (జీఎస్టీ తగ్గడంతో వచ్చే లాభాలను పంచటం) ప్రయోజనాలను ప్రజలకు చేరేలా పరిశ్రమలు చొరవ తీసుకోవాలన్నారు.  

‘ఎఫ్‌ఆర్‌డీఐ’పై పుకార్లు అబద్ధం
బ్యాంకు వినియోగదారులు, వారి డిపాజిట్లను కాపాడే విధంగానే తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌ రిజల్యూషన్స్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు – 2017పై వస్తున్న పుకార్లను  కొట్టిపడేశారు. ఇలాంటి పుకార్లను ఖండించటంలో ఫిక్కీ కీలకంగా వ్యవహరించాలని  కోరారు. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ముసాయిదాలోని ‘బెయిల్‌–ఇన్‌’ నిబంధనపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది డిపాజిట్లు, సేవింగ్స్‌ అకౌంట్లకు ప్రమాదకరమని పేర్కొనటంపై మోదీ పైవిధంగా స్పందించారు.  

బ్రహ్మపుత్ర ‘నలుపు’ కారణమేంటి?
కొంతకాలంగా బ్రహ్మపుత్ర నదీ జలాలు నలుపురంగులోకి మారటానికి కారణాలేంటో తెలుసుకోవాలని విదేశాంగ శాఖ, జలవనరుల శాఖలకు మోదీ ఆదేశించారు. దీనికి పరిష్కార మార్గాలు కనుక్కోవాలని సూచించారు. నీటి రంగు మార్పునకు సంబంధించి చైనాతో చర్చించాలని సుష్మా స్వరాజ్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement