మెరుపు వెనక చీకటి..

Bangle Making Units in Uttar Pradesh - Sakshi

బాల్యం భలే బాగుంటుంది. అమ్మ పెట్టే గోరుముద్దలు..  నాన్న తెచ్చే ఐస్‌క్రీములు.. నానమ్మ చెప్పే చిట్టి కథలు.. ఆటలు.. పాటలు.. అల్లరి.. బాల్యం నిజంగానే బాగుంటుంది!  

అయితే అందరి బాల్యం ఇలాగే ఉండదు..  ఇటుకలు మోసి.. కమిలిపోయిన భుజాలు. అంట్లు తోమి.. అలిసిపోయిన చేతులు. కప్పులు కడిగి.. ముతకబారిన వేళ్లు. పశువులు కాసి.. బొబ్బలు తేలిన కాళ్లు. తిట్లు.. దెబ్బలు.. రకరకాల హింసలు. నిజంగా బాల్యంలో కూడా బాధలుంటాయి. 

సాక్షి,‍ ప్రత్యేకం: బజారులో గాజుల దుకాణానికి వెళ్తే మన కంటికి ఆ గాజుల మెరుపే కనిపిస్తుంది. కానీ ఆ మెరుపు వెనక ఉన్న చీకటి గురించి ఎప్పుడూ ఆలోచించం. ఒక్కసారి ఆలోచిస్తే.. ఆ చీకటిలో ఎన్ని చిన్నారి చేతులున్నాయో తెలుస్తుంది! అవి పడుతున్న బాధలెన్నో తెలుస్తుంది! పట్టుమని పదేళ్లయినా నిండని ఆ లేలేత చేతివేళ్లు.. వేడిని భరిస్తూ, హానికారక వాయువులను పీలిస్తేనే.. రంగురంగుల మెరిసే గాజులు తయారవుతున్నాయనే విషయం మీకు తెలుసా?  

దేవ్‌ ప్రతాప్‌ సింగ్‌.. వయసు 23.. ఒకప్పుడు ఓ గాజుల కర్మాగారంలో బాల కార్మికుడు. ప్రస్తుతం క్లే ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. మనోజ్‌ శంఖ్వార్‌.. వయసు 24.. ఒకప్పుడు బాల కార్మికుడే. ప్రస్తుతం ఓ మున్సిపల్‌ వార్డుకు కౌన్సిలర్‌గా కొనసాగుతున్నాడు. చైల్డ్‌ ఫండ్‌ అనే స్వచ్చంద సంస్థ కాపాడిన వీరిద్దరు.. ఇప్పుడు ఎంతోమంది బాలకార్మికుల విముక్తి కోసం కృషి చేస్తున్నారు.  

ఊహించుకుంటేనే భయమేస్తుంది: ‘ప్రతి పిల్లవాడు పాఠశాలకు వెళ్లాలనేది మా లక్ష్యం. అందుకోసమే మా ఈ ప్రయత్నం. ప్రతి చిన్నారికి బతుకు మీద ఆశ కల్పించే భరోసాను మనమంతా ఇవ్వాలి. లేదంటే ఎంతోమంది చిన్నారులు మొగ్గలుగానే రాలిపోతారు. బాలకార్మికుడిగా నేను పడిన అవస్థలు గుర్తుకొస్తేనే భయమేస్తుంది. బయటపడ్డాం కాబట్టి.. ఇప్పుడు ఇలా ఉన్నాం. లేదంటే.. మా పరిస్థితి ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంద’ని తన గతం గురించి చెప్పుకొచ్చాడు శంఖ్వార్‌. 

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికీ..: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి ఏళ్లు గడుస్తున్నా.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఇప్పటికీ వందలాది గాజుల పరిశ్రమల్లో వేలాదిగా బాలకార్మికులు పనిచేస్తున్నారు. భరించరాని వేడి, హానికరమైన వాయువుల మధ్య వారు పనిచేస్తున్నారు. దారుణమైన విషయమేంటంటే.. తల్లిదండ్రులే తమ పిల్లల్ని ఈ నరకంలోకి దింపుతున్నారు.  

అన్షుల్‌కు ఐదుగురు పిల్లలు. అందరూ 13 ఏళ్ల లోపువారే. వీరిలో నలుగురు అన్షుల్‌తోపాటు గాజుల పరిశ్రమలో పనిచేస్తున్నారు. అన్షుల్‌ సతీమణికి రోడ్డు ప్రమాదంలో భుజానికి గాయమైతే 3.5 లక్షలు అప్పు తెచ్చి, చికిత్స చేయించారు. ఇప్పుడు ఆ కుటుంబమంతా కష్టపడితే వచ్చే రూ.20 వేలు అప్పు మీద వడ్డీకే సరిపోతోంది.
 
ఒక్కో చిన్నారిది ఒక్కో సమస్య..: బాల కార్మికులకు విముక్తి కల్పిం చేందుకు పనిచేసే ఎన్జీవోలు ఈ గాజుల తయారీ పరిశ్రమల్లోని పిల్లల్ని కలిసినప్పుడు వారు చెప్పిన విషయాలు ఎంతో కదిలించాయట. చైల్డ్‌ఫండ్‌ సీఈవో నీలం మఖిజాని ఈ విషయమై మాట్లాడుతూ.. ‘పిల్లల్లోని సృజనాత్మకతను చూశాక ముచ్చటేసింది. కానీ వారు గడుపుతున్న జీవితం చూస్తే బాధగా అనిపించింది. పనిచేయకపోతే పూట గడిచే పరిస్థితి లేదు. దీంతో ముందుగా పిల్లల తల్లిదండ్రుల జీవితాలను బాగుపర్చాలని నిర్ణయించుకున్నాం. వారికి మెరుగైన వేతనాలు అందేలా ఉన్నతాధికారుల సాయం తీసుకున్నాం. తల్లిదండ్రుల ఆదాయం పెరిగితే పిల్లలను పనికి పంపకుండా బడికి పంపుతారనే ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేశాం. కానీ కొన్ని రోజుల తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆ కుటుంబాల్లోని తల్లిదండ్రులెవరూ తమ పిల్లల్ని బడికి పంపే ఆలోచన చేయడంలేదు. దీంతో పోలీసుల సాయంతో కఠిన చర్యలే తీసుకోవాల్సి వచ్చింద’న్నారు.  

మరోకోణం బాలల అపహరణ..: దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పిల్లల్ని కొనుక్కొచ్చి, అపహరించి తీసుకొస్తున్నట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. అలా తీసుకొచ్చిన పిల్లలతో బలవంతంగా పనిచేయిస్తున్నట్లు వెల్లడైంది. పనిచేసినందుకు ఇంత తిండి పెడతారు తప్ప డబ్బులేమీ ఇవ్వరు. ఎదురు తిరిగితే హింసిస్తారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top