
భర్త, చిన్నారిని కాపాడుకున్న వైనం
ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఇద్దరు మహిళలు
బహ్రెయిచ్: తమ వారికి ఏదైనా ఆపదొస్తే మహిళ అపరకాళిగా మారుతుందన్న విషయాన్ని ఉత్తరప్రదేశ్ మహిళలు రుజువుచేశారు. ప్రవాహంలో హఠాత్తుగా ప్రత్యక్షమై ప్రాణసంకటంగా మారిన మొసళ్ల నుంచి తమ వారికి ఇద్దరు మహిళలు రక్షించుకున్న ఘటనలు ఆదివారం బహ్రెయిచ్ జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. «భర్త కాలిని నోట కరిచిన మొసలి నుంచి భార్య కాపాడగా, మరో ఘటనలో ఐదేళ్ల కుమారుడిని మొసలి బారి నుంచి చాకచక్యంగా కాపాడి మరో మహిళ తన తల్లిప్రేమను నిరూపించుకుంది. ఖైరీఘాట్ పరిధిలోని ఘాఘ్రా నదీప్రవాహానికి అనుసంధానంగా ధకియా గ్రామంలో ఒక కాలువ ప్రవహిస్తోంది.
ఇందులోకి ఏడు అడుగుల మొసలి వచి్చచేరింది. ఆదివారం కాలువ సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు వీరును అది ఒక్కసారిగా నోటకరిచి కాలువలోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న బాలుడి తల్లి మాయా ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా వెంటనే మొసలిని సమీపించి తన వద్ద ఉన్న ఇనుప రాడ్డుతో దానిపై దాడిచేసింది. ఆపకుండా పలుమార్లు రాడ్‌తో కొట్టడంతో దెబ్బలకు తాళలేక అది బాలుడిని విడిచిపెట్టింది. విషయం తెల్సుకున్న బహ్రెయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడికి చేరుకుని కాలువలోకి మళ్లీ మొసళ్లురాకుండా వలలు ఏర్పాటుచేయించారు.
మోతీపూర్ పరిధిలోని మాధవపూర్ గ్రామంలో అటుగా వెళ్లేందుకు రామ్‌తాలియా కాలువ దాటాల్సి ఉంటుంది. ఆదివారం 45 ఏళ్ల సైఫూ తన భార్య సుర్జానా, బంధువుతో కలిసి కాలువ దాటుతుండగా అందులోని పెద్ద మొసలు సైఫూ కాలిని నోట కరిచి కాలువ లోపలికి లాక్కెళ్లింది. ప్రాణభయంతో సైఫూ అరడం మొదలెట్టాడు. పక్కనే ఉన్న భార్య సుర్జానా ఏమాత్రం భయపడకుండా చీర కొంగును అతని వైపు విసిరి పట్టుకుని బయటకు లాగింది. ఇది చూసిన సమీప గ్రామస్థులు పరుగున వచ్చి కర్రలతో మొసలిపై దాడి చేసి సైఫూ కాలిని ఎలాగోలా విడిపించారు.