రాజధానిలో రెండు లక్షల సెన్సర్‌ లైట్లు | Sakshi
Sakshi News home page

రాజధానిలో రెండు లక్షల సెన్సర్‌ లైట్లు

Published Mon, Sep 23 2019 7:16 PM

Arvind Kejriwal Says We Will Launch Mukhyamantri Street Light Yojana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించే దిశగా దేశ రాజధానిని సురక్షిత నగరంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఢిల్లీ నగరంలో రెండు లక్షలకు పైగా సెన్సర్లతో రూపొందిన వీధి దీపాలను అమర్చుతామని చెప్పారు. ఈ వీధి దీపాలకు పిల్లర్లు ఏర్పాటు చేయబోమని, స్వచ్ఛందంగా ముందుకువచ్చే వారి ఇండ్లపైనా వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి స్ట్రీట్‌లైట్‌ యోజన పథకానికి శ్రీకారం చుడతామని చెప్పారు.

వీధిదీపాలకు అయ్యే విద్యుత్‌ను వాటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వారి విద్యుత్‌ బిల్లుల నుంచి తగ్గిస్తామని స్పష్టం చేశారు. కీలక ప్రాంతాల్లో 20-40 వాట్ల ఎల్‌ఈడీ లైట్లను అమర్చుతామని చెప్పారు. సూర్యాస్తమయం అయిన తర్వాత వెలిగి, సూర్యోదయం తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా ఆయా లైట్లలో సెన్సర్లు ఉంటాయని తెలిపారు. వీధి దీపాలు లేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని, ఆయా ప్రాంతాలను స్దానిక ఎమ్మెల్యేలు గుర్తిస్తారని చెప్పారు. కాగా ఢిల్లీలో ఇప్పటికే మూడు లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆప్‌ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ నాటికి సీసీటీవీ కెమెరాల అమరిక పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement