ఐఐటీలోకి టైలర్‌ కొడుకు, సీఎం కొడుకు

Arvind Kejriwal  Happy On Tailor Son Cracked IIT  - Sakshi

ఢిల్లీ : మన దేశంలో ఓ ముఖ్యమంత్రి కొడుకు, ఓ సామాన్యుడి కొడుకు ఒకే పాఠశాలలో చదవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో జరగని పని. కానీ తాము ఆ అసమాన స్థితిని తొలగిస్తామని చెబుతున్నారు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఐఐటీ శిక్షణ కార్యక్రమంలో లబ్ధి పొందిన విజయ్‌కుమార్‌ అనే విద్యార్థి ఐఐటీలో ప్రవేశం పొందాడు. విజయ్‌ తండ్రి టైలరింగ్‌ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా తన కొడుకు, ఆ టైలర్‌ కొడుకు కలిసి ఒకే ఐఐటీలో చదువుకుంటున్నారని... దీనికి తాను చాలా సంతోషంగాను, గర్వంగానూ ఫీలవుతున్నాని ట్వీట్‌ చేశారు. 

‘నా కొడుకుతో పాటు ఓ టైలర్‌ కుమారుడు ఒకేసారి ఐఐటీలో చదువుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అంబేడ్కర్ కలలుగన్న సమానత్వాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఈ విధంగా సాకారం చేస్తోంది. ఉన్నత విద్య కేవలం ధనవంతులకే అన్న సంప్రదాయం ఇక చెరిగిపోనుంది’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో పేదవారికి  నాణ్యమైన విద్య  అందని ద్రాక్షగానే ఉండేదని కానీ, ఆప్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన ‘జై భీం ముఖ్యమంత్రి ప్రతిభ వికాస్ యోజన’ ద్వారా 4,953 దళిత విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇచ్చామన్నారు. పోటీ పరీక్షలలో విజయం సాధించే విధంగా శిక్షణను అందించడమే ముఖ్య ఉద్దేశమన్నారు.

మరోవైపు ఆప్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హ‍్యాపీనెస్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విద్యార్థులలో నేరప్రవృత్తి, ఉగ్రవాదం, ద్వేషం లాంటి చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా సామాన్యుడు ముఖ్యమంత్రి కావచ్చని నిరూపించిన వ్యక్తి అరవింద్‌ కేజ్రీవాల్‌. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: కేజ్రీవాల్‌ యూటర్న్‌ తీసుకున్నారా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top