కేరళ వరదలు : ఐఫోన్‌ కంపెనీ విరాళమెంతో తెలుసా?

Apple Donates Rs 7 Crore For Keralas Flood Victims - Sakshi

తిరువనంతపురం : ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ భారీ వరదలతో అతలాకుతలమైంది. వందలాది మంది మరణించగా... లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కకావికలమైన కేరళను కాపాడేందుకు యావత్‌ భారత దేశం ముందుకొస్తోంది. డబ్బు, నిత్యావసర వస్తు సామాగ్రిని సాయం చేస్తూ అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా దిగ్గజ ఐఫోన్‌ తయారీ కంపెనీ ఆపిల్‌ కూడా కేరళకు ఆర్థికసాయం ప్రకటించింది. రాష్ట్రానికి రూ. 7 కోట్ల విరాళం అందిస్తున్నట్లు వెల్లడించింది. 

‘కేరళలో వరదల పరిస్థితి గురించి తెలిసి మేం ఎంతగానో దిగ్భ్రాంతి చెందాం. కేరళ సీఎం సహాయనిధి, మెర్సీ కార్ప్స్‌ ఇండియాకు రూ. 7 కోట్ల విరాళం అందిస్తున్నాం. వీటిని అవసరమైన దగ్గర స్కూళ్లను, ఇళ్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగించండి’ అని ఆపిల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక.. కేరళను ఆదుకునేందుకు ముందుకురావాలని ఆపిల్‌ తన యూజర్లను ప్రోత్సహిస్తోంది. తన హోమ్‌ పేజీలో సపోర్ట్‌ బ్యానర్లను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాక యాప్‌ స్టోర్‌, ఐట్యూన్‌లలో మెర్సీ కార్ప్స్‌కు విరాళాలు అందించేందుకు డొనేట్‌ బటన్ ఏర్పాటుచేసింది. ఈ బటన్‌ ద్వారా ఆపిల్‌ యూజర్లు తమ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కేరళకు విరాళం ఇవ్వొచ్చని వెల్లడించింది.

భారీ ఎత్తున సంభవించిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపిల్‌ తన ఐట్యూన్స్‌ స్టోర్‌, ఆపిల్‌ స్టోర్ల ద్వారా విరాళాలు సేకరించి, తీవ్రంగా దెబ్బతిన్న వాటికి సాయంగా అందిస్తూ ఉంటుంది. ఆపిల్‌ కస్టమర్లు తమ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను వాడి 5 డాలర్లు, 10 డాలర్లు, 25 డాలర్లు, 50 డాలర్లు, 100 డాలర్లు, 200 డాలర్లను మెర్సీ కార్ప్స్‌కు డొనేట్‌ చేయొచ్చు. కాగ భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన కేరళ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పునరావస కేంద్రాల నుంచి ఇళ్లకు తరలివెళ్తున్నారు. మరోవైపు కేరళను ఆదుకునేందుకు స్వదేశీయులతో పాటు విదేశీయులు సైతం ముందుకొస్తున్నారు. భారీగా విరాళాలు ప్రకటిస్తూ కేరళ ప్రజలకు అండగా ఉంటున్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top