
సాక్షి, చెన్నై : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళ భాషను నేర్చుకుంటున్నారు. ఆ భాష మీద పట్టు సాధించేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నట్టు ఇక్కడి కమలనాథులు పేర్కొంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఆయన పర్యటన సాగుతున్నా, మెజారిటీ శాతం హిందీ తెలిసిన వాళ్లు అక్కడల్లా ఉండడం ఆయనకు కలిసి వచ్చిన అంశం. అయితే, తమిళనాట హిందీ అంటే భగ్గుమనే వాళ్లే అధికం.
దీనిని పరిగణనలోకి తీసుకున్న అమిత్ షా తమిళం మీద పట్టుకు కుస్తీలు పడుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పాగావేయాలనే ప్రయత్నంలో ఉన్న కమలం నేత, ప్రజల్ని ఆకర్షించేందుకు తమిళ ప్రసంగం సాగించే విధంగా కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడి ప్రజలు, కేడర్‌తో సంప్రదింపులు జరిపే సమయంలో భాషాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అనర్గళంగా మాట్లాడే విధంగా, అర్థం చేసుకునే విధంగా తమిళం మీద ఆయన సాధనలో నిమగ్నమైనట్టు ఇక్కడి బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.