బీజేపీ, ఆప్‌ పై అభియోగపత్రం | Allegedly document on bjp,aap | Sakshi
Sakshi News home page

బీజేపీ, ఆప్‌పై అభియోగపత్రం

Aug 22 2014 10:13 PM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీ, ఆప్‌ పై అభియోగపత్రం - Sakshi

బీజేపీ, ఆప్‌ పై అభియోగపత్రం

బీజేపీ, ఆప్‌పై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కి కాంగ్రెస్ పార్టీ శుక్రవారం 25 పేజీల అభియోగపత్రం సమర్పించింది. పక్షం రోజుల్లోగా ఈ రెండు పార్టీలపై చర్య తీసుకోవాలని విన్నవించింది.

పక్షం రోజుల్లో చర్య తీసుకోవాలని ఎల్జీకి కాంగ్రెస్ విన్నపం
 
న్యూఢిల్లీ: బీజేపీ, ఆప్‌ పై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కి కాంగ్రెస్ పార్టీ శుక్రవారం 25 పేజీల అభియోగపత్రం సమర్పించింది. పక్షం రోజుల్లోగా ఈ రెండు పార్టీలపై చర్య తీసుకోవాలని విన్నవించింది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ నేతృత్వంలోని ఆ పార్టీకి చెందిన సభ్యుల బృందం అభియోగపత్రం సమర్పించింది. అనంతరం డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ ‘లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కి  25 పేజీల అభియోగపత్రం సమర్పించాం. 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని విన్నవించాం’ అని అన్నారు.
 
ఒకవే ళ చర్యలు తీసుకోకపోతే మేము ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని లవ్లీ హెచ్చరించారు. కాగా ఢిల్లీవాసుల దుస్థితికి ఈ రెండు పార్టీలే కారణమని సదరు అభియోగపత్రంలో కాంగ్రెస్ ఆరోపించింది. విద్యుత్ చార్జీలను ఆయా పంపిణీ సంస్థలు బలవంతంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించింది. కాగా ఢిల్లీ శాసనసభ  సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు.
 
అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.
 
ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement