చిదంబరానికి ఊరట

Aircel-Maxis Case, P Chidambaram Granted Anticipatory Bail - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్‌–మ్యాక్సిస్‌ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంనకు ఊరట లభించింది. ఆయన్ను ఆగస్ట్‌ 7వ తేదీ వరకు అరెస్ట్‌ చేయరాదంటూ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుకు 3 వారాల్లోగా బదులివ్వాలని స్పెషల్‌ కోర్టు జడ్జి సీబీఐను ఆదేశించారు. ఎయిర్‌సెల్‌–మ్యాక్సిస్‌ కేసులో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీపై సీబీఐ చార్జిషీటు వేసింది. దీంతో తనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశారు.

విదేశాలకు వెళ్లేందుకు కార్తీకి అనుమతి
ఎయిర్‌సెల్‌–మ్యాక్సిస్, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం కొడుకు కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఓకేచెప్పింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వెళ్లేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది.

చిదంబరం కుటుంబంపై అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను దాచిన కేసులో చిదంబరం కుటుంబం విచారణకు హాజరు కాకపోవడాన్ని చెన్నై ఎగ్మూరు న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిలకు బ్రిటన్, అమెరికాలో ఉన్న ఆస్తులకు సంబంధించి నల్లధనం చట్టం కింద ఐటీ శాఖ కేసు వేసింది. ఈ కేసు సోమవారం విచారణకు రాగా ఆ ముగ్గురూ హాజరు కాలేదు. దీంతో వారిపై న్యాయమూర్తి మలర్‌విళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీన వారంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top