సివిల్‌ ఇంజనీర్లకు డిమాండు తక్కువే

AICTE Says Civil Engineers Demand Decreasing - Sakshi

ఏఐసీటీఈ గణాంకాలు వెల్లడి

దేశంలో సివిల్‌ ఇంజనీర్‌ కోర్సుకు అనుకున్నంతగా డిమాండు లేదని ప్రాంగణ నియామకాల తీరు వెల్లడిస్తోంది.2012–13 నుంచి2015–16 మధ్య కాలంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ పాసయిన వారిలో కేవలం 38 శాతం మందికే  ఉద్యోగాలు లభించాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)గణాంకాలను బట్టి తెలుస్తోంది.దేశంలో నిర్మాణ రంగం శరవేగంతో పురోగమిస్తున్న ఈ తరుణంలో ఆ రంగానికి కీలకమైన సివిల్‌ ఇంజనీర్లకు డిమాండు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఏఐసీటీఈ ఆమోదించిన  ఆరు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మూడు కోర్సులకు –కెమికల్, కంప్యూటర్‌ సైన్స్, మెకానికల్‌–మాత్రమే డిమాండు ఉంది. ఆ కోర్సుల్లో ప్రాంగణ నియామకాలు 50 శాతానికి మించి ఉన్నాయి.అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సివిల్‌ ఇంజనీరింగ్‌తో పోలిస్తే కెమికల్‌ ఇంజనీరింగ్‌వంటి కోర్సుల్లో చేరే వారి సంఖ్య చాలా తక్కువ ఉంది. కాబట్టి వారిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని ఏఐసీటీఈ లెక్కలు స్పష్టం  చేస్తున్నాయి. 2012–13 సంవత్సరంలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో 11.98 లక్షల మంది చేరగా, వారిలో 4.64 లక్షల మంది(39శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1.74 లక్షల మంది(38శాతం)కే ఉద్యోగాలు లభించాయి.

కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 86 వేల మంది చేరితే,45 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో25వేల మందికి(55%) ఉద్యోగాలు వచ్చాయి. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 20 లక్షల మందికిపైగా చేరారు. వీరిలో 9.40 లక్షల మంది పాసయ్యారు.4.74 లక్షల(50శాతం) మందికి ఉద్యోగాలు లభించాయి. మొత్తం మీద కెమికల్, కంప్యూటర్‌ సైన్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లలోనే 50శాతానికిపైగా ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. దేశంలో ఇంజనీరింగ్‌ సీట్లు తామరతంపరగా పెరిగిపోవడంతో కోర్సు పూర్తి చేసి బయటకొస్తున్న వారి సంఖ్య కూడ పెరుగుతోందని, అయితే, వారిలో చాలా మందికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడటంతో ఉద్యోగాలు లభించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top