స్కూళ్లకూ భద్రత కల్పిస్తాం | After Pradyuman Murder, Paramilitary Force CISF Offers To Make Schools Safe | Sakshi
Sakshi News home page

స్కూళ్లకూ భద్రత కల్పిస్తాం

Nov 20 2017 2:53 AM | Updated on Nov 20 2017 3:33 AM

After Pradyuman Murder, Paramilitary Force CISF Offers To Make Schools Safe - Sakshi - Sakshi

న్యూఢిల్లీ: పాఠశాలల్లోని విద్యార్థులకు ఆరోగ్యకరమైన, సురక్షిత వాతావరణం కల్పించడంలో భాగంగా దేశవ్యాప్తంగా స్కూళ్లకు కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) తెలిపింది. ఈ మేరకు నవోదయ విద్యాలయ కమిటీ, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సొసైటీ, కేంద్రీయ విద్యాలయ, డూన్‌ స్కూల్, స్ప్రింగ్‌డేల్స్, సల్వాన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్, సంస్కృతి మదర్స్‌ ఇంటర్నేషనల్, శ్రీరామ్‌ అండ్‌ అప్పీజే ఎడ్యుకేషనల్‌ సొసైటీ, సింధియా స్కూల్, చిత్తూరు జిల్లాలోని రిషీవ్యాలీ తదితర పాఠశాలలకు లేఖలు రాసింది.

ఇటీవల గురుగ్రామ్‌లోని ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండో క్లాస్‌ విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్‌ హత్యకు గురైన నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్‌ ఈ మేరకు స్పందించింది. విమానాశ్రయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, సెబీ, ఎయిమ్స్‌ సహా దాదాపు 200 ప్రతిష్టాత్మక సంస్థలకు భద్రత కల్పిస్తున్నట్లు సీఐఎస్‌ఎఫ్‌ డీజీ ఓపీ సింగ్‌ తెలిపారు. ప్రైవేటు భద్రతా సంస్థలు ఒక్కో పాఠశాలలో రక్షణ ఏర్పాట్లకు రూ.20 లక్షల వరకు వసూలు చేస్తే అదే పనికి సీఐఎస్‌ఎఫ్‌  రూ.4– 4.5 లక్షలే వసూలు చేస్తుందన్నారు.

తొలుత క్లయింట్‌తో ఒప్పందం ఖరారైన వెంటనే సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ప్రత్యేక నిపుణుల కమిటీ పాఠశాలను తనిఖీ చేసి 3–4 నెలల్లో నివేదిక సమర్పిస్తుందన్నారు. స్కూళ్లలోకి వచ్చేవాళ్లను తనిఖీ చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, భద్రతా సిబ్బంది మోహరింపు, అత్యవసర ప్రతిస్పందన పరికరాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి విషయాలను ఈ నివేదికలో పొందుపరుస్తామన్నారు. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా తనిఖీల్లో పాఠశాలల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలను కూడా చేర్చినట్లు పేర్కొన్నారు. 1969లో స్థాపించిన సీఐఎస్‌ఎఫ్‌ హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement