మానసికంగా వేధించారు

Abhinandan Varthaman Says He Was Mentally Harassed In Pakistan - Sakshi

రక్షణ మంత్రి దృష్టికి తెచ్చిన అభినందన్‌

పాక్‌ చెరలోని అనుభవాల్ని పంచుకున్న పైలట్‌

కుటుంబ సభ్యులను కలుసుకున్న పైలట్‌

ఢిల్లీలో కొనసాగుతున్న వైద్య పరీక్షలు

నేడు ముగిసే అవకాశం.. తరువాత విచారణ

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ చెరలో ఉన్న సమయంలో తనను శారీరకంగా హింసించకున్నా మానసికంగా చాలా వేధింపులకు గురిచేశారని భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ శనివారం వైమానిక దళ ఉన్నతాధికారులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం ఆరోగ్య పరీక్షల సమయంలో తనను కలవడానికి వచ్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అధికారులతో ఆయన ఈ విషయాలు పంచుకున్నట్లు తెలిసింది.

పాకిస్తాన్‌లో వేధింపులకు గురైనా అభినందన్‌ మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నారని అధికారులు తెలిపారు. తమ భూభాగంలో దొరికిపోయిన తరువాత అభినందన్‌పై కొందరు స్థానికులు భౌతిక దాడికి పాల్పడ్డారని, కానీ తాము ఆయనని రక్షించి జెనీవా ఒప్పంద మార్గదర్శకాల ప్రకారం చికిత్స అందించామని పాకిస్తాన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. గాయాలతో రక్తం కారుతుండగా అభినందన్‌ను పాకిస్తాన్‌ సైనికులు తీసుకెళ్తున్న వీడియో బహిర్గతం కావడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత అక్కడి సైనికులతో మాట్లాడుతూ అభినందన్‌ టీ తాగుతున్న మరో వీడియో విడుదలైంది. భారత్‌కు అప్పగించే ముందు అభినందన్‌తో పాకిస్తాన్‌ సైన్యాన్ని పొగుడుతూ ఓ వీడియోను రూపొందించినట్లు శుక్రవారం మీడియాలో కథనాలు వచ్చాయి. అల్లరి మూక నుంచి పాకిస్తాన్‌ ఆర్మీయే తనను కాపాడిందని చెప్పిన ఆ వీడియో షూటింగ్‌ వల్లే అభినందన్‌ అప్పగింత ఆలస్యమైందని కూడా భావిస్తున్నారు. పాకిస్తాన్‌ నుంచి తిరిగొచ్చిన తరువాత అభినందన్‌ కుడి కన్ను ఉబ్బినట్లు కనిపించింది.

నిర్మలకు వివరించిన అభినందన్‌..
ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ సెంట్రల్‌ మెడికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కేంద్రంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభినందన్‌ను కలుసుకున్నారు. ఆయన ధైర్యసాహసాల పట్ల దేశం గర్విస్తోందని ఆమె కొనియాడినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ చెరలో ఉన్న 60 గంటల పాటు తానెదుర్కొన్న అనుభవాలు, పరిస్థితుల్ని అభినందన్‌ నిర్మలా సీతారామన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అభినందన్‌ భార్య స్క్వాడ్రన్‌ లీడర్‌ తాన్వి మార్వా(రిటైర్డ్‌), ఏడేళ్ల కొడుకు, సోదరి అదితి కూడా అక్కడే ఉన్నారు.

‘కూలింగ్‌ డౌన్‌’ పరీక్షలు
పాక్‌ నిర్బంధం నుంచి విడుదలైన  పైలట్‌ అభినందన్‌కు శనివారం వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం వాఘా సరిహద్దులో ఆయన్ని పాక్‌ అధికారులు అప్పగించాక నేరుగా ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ‘కూలింగ్‌ డౌన్‌’ విధానంలో భాగంగా అభినందన్‌ మానసిక, శారీరక ఆరోగ్య స్థితిగతుల్ని మదింపు చేయడానికి జరుగుతున్న పరీక్షలు ఆదివారం వరకు కొనసాగే అవకాశాలున్నాయి. ఆర్మీ, నిఘా అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్స్‌ సెంట్రల్‌ మెడికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(ఏఎఫ్‌సీఎంఈ) కేంద్రంలో అభినందన్‌ హెల్త్‌ చెకప్‌ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత, పాకిస్తాన్‌ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి పూర్తి సమాచారం రాబట్టేందుకు ఆయన్ని విచారిస్తామని అధికారులు తెలిపారు. అంతకుముందు, అభినందన్‌ను ఆయన తల్లిదండ్రులు, వైమానిక దళ ఉన్నతాధికారులు కలుసుకున్నారు.


అభినందన్‌ రాకతో శనివారం ఢిల్లీలో బీజేపీ కార్యకర్తల సంబరాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top