మోదీతో నోబెల్‌ విజేత అభిజిత్‌ భేటీ | Sakshi
Sakshi News home page

మోదీతో నోబెల్‌ విజేత అభిజిత్‌ భేటీ

Published Wed, Oct 23 2019 3:27 AM

Abhijit Banerjee Meets PM Modi In New Delhi   - Sakshi

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు, ఈ ఏడాది ఆర్థిక నోబెల్‌ పురస్కార విజేత అభిజిత్‌ బెనర్జీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇరువురి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. అభిజిత్‌ తనతో భేటీ అయిన ఫొటోని కూడా మోదీ ట్విట్టర్‌లో ఉంచారు. ‘నోబెల్‌  గ్రహీత అభిజిత్‌ బెనర్జీతో సమావేశం అద్భుతంగా సాగింది. మానవ సాధికారతపై ఆయనకున్న తపన స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ అంశాలపై ఆలోచనల్ని పంచుకున్నాం. ఆయన సాధించిన విజయాలను చూసి భారత్‌ గర్విస్తోంది’ అని మోదీ ట్వీట్‌ చేశారు. కోల్‌కతాకు చెందిన అభిజిత్‌ బెనర్జీ ప్రస్తుతం అమెరికాలో మసాచూసెట్స్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.

మోదీ ఆలోచనలు వినూత్నం: అభిజిత్‌
ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత అభిజిత్‌ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. భారత్‌లో పాలనను గాడిలో పెట్టడానికి మోదీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ‘ఎన్డీయే పరిపాలనపై క్షేత్రస్థాయిలో కొందరిలో నెలకొన్ని ఉన్న అపోహలను తొలగించాలంటే పరిపాలనకు సంబంధించి ప్రజల సలహాలు కూడా స్వీకరించాలని, అధికార వ్యవస్థని ప్రక్షాళన చేసి ప్రజలకు జవాబుదారీ తనాన్ని పెంచాలని మోదీ చెప్పారు. భారత్‌ అభివృద్ధి కోసం మోదీ ఆలోచనలు వినూత్నంగా ఉన్నాయి’’అంటూ అభిజిత్‌ ఆకాశానికెత్తేశారు.  

మీడియాపై మోదీ జోకులు  
ప్రధానమంత్రిని తాను కలుసుకోగానే ఆయన బోల్డన్ని జోకులు వేశారని, ముఖ్యంగా మీడియా గురించి ఛలోక్తులు విసిరారని అభిజిత్‌ చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా మీరేమైనా చెబుతారేమోనని బయట మీడియా కాచుకొని కూర్చుంది. మీ నుంచి అలాంటి వ్యాఖ్యలు రాబట్టాలని ప్రయతి్నస్తుంది అంటూ మోదీ తనతో నవ్వుతూ చెప్పారని వెల్లడించారు. ‘‘మోదీ టీవీ చూస్తూ ఉంటారు, మీడియా ప్రతినిధులు ఏం చేస్తారో గమనిస్తూ ఉంటారు. మీడియా ఏం చేస్తుందో ఆయనకు బాగా తెలుసు’అని అభిజత్‌ చెప్పారు.

Advertisement
Advertisement