రాజ్యాంగ ధర్మాసనానికి ‘ఆధార్‌’

Aadhaar to face Supreme Court scrutiny, govt says won't extend deadline - Sakshi

మధ్యంతర ఉత్తర్వులకు కేంద్రం అభ్యంతరంతో సుప్రీం నిర్ణయం

ఆధార్‌ లేనివారికి మాత్రమే గడువు పెంపు వర్తిస్తుందన్న కేంద్రం

న్యూఢిల్లీ: వివిధ సేవలు పొందేందుకు, సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్లను నవంబర్‌ చివరి వారంలో రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆధార్‌ ఉన్నవారికి కూడా అనుసంధానం గడువును డిసెంబర్‌ 31 తర్వాత పొడిగించేందుకు కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయాన్ని వెలువరించింది.

ఈ కేసులో వాదనలు విన్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కేంద్రం వాదనను వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ విజ్ఞప్తి చేయడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గోపాల్‌ సుబ్రమణియమ్‌ వాదిస్తూ.. ‘ఆధార్‌ పూర్తిగా స్వచ్ఛంద ప్రక్రియ.. ప్రభుత్వ పథకాల లబ్ధికి తప్పనిసరిగా కార్డు కలిగి ఉండాలన్న ఒత్తిడి ప్రజలపై ఉండకూడదు’ అని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుందరం వాదిస్తూ.. ఈ అంశంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశాన్ని విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది.

ఆధార్‌ ఉంటే అనుసంధానం తప్పనిసరి
ఆధార్‌ అనుసంధానం గడువు పెంపుపై అక్టోబర్‌ 25న సుప్రీంకోర్టుకు కేంద్రం తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ‘ప్రభుత్వ పథకాల లబ్ధికి ఆధార్‌ అనుసంధానం గడువును ఆధార్‌ లేనివారి కోసం మార్చి 31, 2018కి పెంచుతున్నాం. ఆధార్‌ లేనివారిని ఇబ్బంది పెట్టం. మార్చి 31 వరకూ వారికి సంక్షేమ పథకాల లబ్ధిని నిరాకరించం. ఇప్పటికే ఆధార్‌ ఉన్నవారు మాత్రం ఆ నంబర్‌ను సిమ్‌ కార్డు, బ్యాంకు ఖాతా, పాన్‌ కార్డు, ఇతర పథకాలకు అనుసంధానం చేసుకోవాలి. అందుకోసం సెక్షన్‌ 7 నోటిఫికేషన్లు జారీ చేశాం’ అని అటార్నీ జనరల్‌ సుప్రీం కోర్టుకు తెలిపారు.

కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రం ప్రశ్నిస్తుందా?
సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను సుప్రీం కోర్టులో సవాలు చేసిన పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా సవాలు చేయగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘ఒక రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తుంది? సమాఖ్య వ్యవస్థలో పార్లమెంట్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్రం పిటిషన్‌ ఎలా దాఖలు చేయగలదు?’ అని జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం బెంగాల్‌ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. బెంగాల్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మిక శాఖ.. తాను ఇస్తున్న సబ్సిడీలకు సంబంధించి పిటిషన్‌ను దాఖలు చేసిందని కోర్టుకు వివరించారు. ఇంతలో కోర్టు జోక్యం చేసుకుని.. ‘ఆధార్‌ అనుసంధానం సవాలు పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని మాకు తెలు సు. అయితే ఒక రాష్ట్రం ఎలా సవాలు చేయవచ్చన్న అంశంపై మాకు సంతృప్తికర సమాధానం చెప్పండి. కేంద్రం నిర్ణయాన్ని వ్యక్తులు సవాలు చేయొచ్చు.. అంతేగానీ రాష్ట్రాలు కాదు. మమతా బెనర్జీని వ్యక్తిగతంగా పిల్‌ దాఖలు చేయమనండి. వ్యక్తిగత హోదాలో పిల్‌ దాఖలు చేస్తే అప్పుడు దానిని పరిగణనలోకి తీసుకుంటాం’ అని సుప్రీం వెల్లడించింది.

సుప్రీం ఆదేశాల్ని పాటిస్తా: సుప్రీం ఆదేశాల్ని తాను పాటిస్తానని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ‘వారి తీర్పును వారు ఇచ్చారు. మనం దానిని పాటించాలి. ఏదో సమస్యగా భావించడం లేదు. మనం తీర్పును అభినందించాలి’ అని పేర్కొన్నారు.     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top