క్లోరోక్విన్‌తో దుష్ప్రభావాల్లేవు | 6500 Corona Positive Cases Registered Within 24 Hours In India | Sakshi
Sakshi News home page

క్లోరోక్విన్‌తో దుష్ప్రభావాల్లేవు

May 27 2020 4:01 AM | Updated on May 27 2020 4:01 AM

6500 Corona Positive Cases Registered Within 24 Hours In India - Sakshi

ముంబైలోని ధారావిలో బస్సుల కోసం వలస కార్మికుల ఎదురుచూపులు 

న్యూఢిల్లీ: హైడ్రాక్సిక్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ) ఔషధం వాడకంతో పెద్దగా దుష్ప్రభావాలేవీ లేవనీ, కోవిడ్‌–19 నివారణ, చికిత్సలో దీని వాడకం కొనసాగించాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది. కోవిడ్‌–19 రోగుల భద్రత దృష్ట్యా హెచ్‌సీక్యూను ప్రయోగాత్మకంగా వాడటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ణయించిన నేపథ్యంలో ఐసీఎంఆర్‌ ఈ మేరకు పేర్కొంది. ‘హెచ్‌సీక్యూ వాడకంతో కొద్దిపాటి వికారం, వాంతులు, గుండెదడ తప్ప మరే ఇతర తీవ్ర దుష్ప్రభావాలు మా అధ్యయనంలో కనిపించలేదు.

అందుకే, కోవిడ్‌–19 నివారణకు దీనిని వాడవచ్చని సిఫారసు చేస్తున్నాం’ అని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. ‘కోవిడ్‌–19 చికిత్సకు ఏ ఔషధం పనిచేస్తుంది? ఏది పనిచేయదు? అనేది ఇంకా రుజువు కాలేదు. ఖాళీ కడుపుతో కాకుండా ఆహారంతోపాటే హెచ్‌సీక్యూను తీసుకోవాలి. దీంతో చికిత్స సమయంలో ఈసీజీ పరీక్ష జరపాలి. హెచ్‌సీక్యూ వాడకంతో ఉన్న లాభాల దృష్ట్యా ఆరోగ్య కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బందికీ ఇవ్వాలని నిర్ణయించాం’ అని భార్గవ తెలిపారు. ప్రతి రోజూ లక్షకు పైగా కోవిడ్‌ పరీక్షలు జరిపే స్థాయికి చేరుకున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 31,26,119 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

ఆంక్షల సడలింపే ఆజ్యం పోసింది 
దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతుండటానికి ముఖ్య కారణం ప్రయాణ ఆంక్షల సడలింపేనని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, హాట్‌స్పాట్లున్న ప్రాంతాల నుంచే కోవిడ్‌–19 కేసులు బయటపడుతున్నాయని తెలిపారు. ‘సడలించిన ప్రయాణ ఆంక్షలు, వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్తుండటం వల్ల కూడా రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వలస కార్మికులు తిరిగి వచ్చిన ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదముంది. ఇలాంటి చోట్ల పర్యవేక్షణ, నిఘా మరింతగా పెరగాలి. జనం ఇళ్లు వదిలి బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలి. లేకుంటే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది’ అని తెలిపారు.

24 గంటల్లో 6,500 కేసులు
దేశంలో కోవిడ్‌–19 మహమ్మారితో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,167కు చేరుకోగా, మొత్తం కేసులు 1,45,380కు పెరిగాయి. 24 గంటల్లోనే 146 మంది చనిపోగా 6,535 కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా, యాక్టివ్‌ కేసులు 80,722 కాగా, ఇప్పటి వరకు 60,490 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. దీంతో రికవరీ రేటు 41.61%గా ఉన్నట్లు వివరించింది. అదేవిధంగా, మృతుల రేటు ఏప్రిల్‌ 15న 3.3 శాతం ఉండగా ప్రస్తుతం 2.87 శాతానికి తగ్గిందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement