నిదుర పోరా తమ్ముడా...! | 60 Percent of Indians who do not Prefer Sleep | Sakshi
Sakshi News home page

నిదుర పోరా తమ్ముడా...!

Apr 2 2018 3:51 AM | Updated on Apr 2 2018 3:51 AM

60 Percent of Indians who do not Prefer Sleep - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిద్ర... మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యతున్న అంశం. చుట్టూ ఏదో జరిగిపోతోంది. జీవితంలో ఏదో సాధించాలి..అమ్మో.. టైమ్‌ చాలా తక్కువగా ఉందని భావించే వారూ ఎక్కువ మందే ఉన్నారు. దీని కారణంగానే వారు నిద్రాకాలాన్ని తగ్గించుకుంటున్నట్టు ఓ పరిశోధనలో వెల్లడైంది. అయితే దీనిని దీర్ఘకాలిక ప్రాతిపదికన విశ్లేషిస్తే ఆరోగ్య, శక్తి సామర్థ్యాలపరంగా నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు అంటున్నారు. వరల్డ్‌ స్లీప్‌ కమిటీ ఏటా మార్చి 16ను ‘వరల్డ్‌ స్లీప్‌ డే’గా నిర్వహిస్తోంది. నిద్రను ఒక పండుగలా నిర్వహించేందుకు ఈ రోజు ఉపయోగపడుతుందని, నిద్రతో ముడిపడిన ఆరోగ్యం, మందులు, విద్య లాంటి సామాజిక అంశాలను చర్చించడానికి దోహదపడుతుందని ఆ కమిటీ పేర్కొంది. నిద్రలో నడిచేవారు 15 శాతం ఉంటారని, నిద్రలో వచ్చిన కలలు 50 శాతం మెలకువతోనే మరిచిపోతామని మరో అధ్యయనంలో వెల్లడైంది.  

అరవై శాతానికి పైగా భారతీయులు నిద్రను ప్రాధాన్యతా అంశంగా పరిగణించడం లేదని, కొంతమంది ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర కంటే కూడా శారీరక వ్యాయామమే ముఖ్యమనే అభిప్రాయంతో ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. మెరుగైన ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా అవసరమే అన్న విషయం చాలా మందికి అవగాహన లేదని ఫిలిప్స్‌ ఇండియా నిర్వహించిన తాజా సర్వే తేల్చింది. భారత్‌తో సహా అమెరికా, బ్రిటన్, జర్మనీ, పోలాండ్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా, కొలంబియా, అర్జెంటీనా, మెక్సికో, బ్రెజిల్, జపాన్‌లలోని 15 వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలున్నాయి. టెక్నాలజీతో నిద్రాభంగంమన దేశం విషయానికొస్తే,... సుఖమయమైన నిద్ర కోసం 45 శాతం వయోజనులు ధ్యానం (మెడిటేషన్‌) చేస్తున్నారు.

నిద్ర నుంచి దృష్టి మళ్లేందుకు, నిద్రించే సమయం తగ్గిపోయేందుకు టెక్నాలజీ ప్రధాన ప్రతిబంధకంగా మారిందని 32 శాతం అభిప్రాయపడ్డారు. రోజూ సవ్యంగా నిద్రపోయేందుకు ‘ప్రత్యేక బెడ్డింగ్‌’ఏర్పాట్లు చేసుకున్నట్టు 24 శాతం మంది వెల్లడించారు. పనివేళల కారణంగా సాధారణ నిద్రా సమయం ప్రభావితం అవుతోందని 19 శాతం మంది పేర్కొన్నారు. అందరూ అనుకుంటున్న దాని కంటే అపసవ్యమైన నిద్రే మరింత తీవ్రమైన సమస్య అని ఫిలిప్స్‌ సంస్థ స్లీప్, రెస్పిరేటరీ హెడ్‌ హరీశ్‌ చెబుతున్నారు. దీని ప్రభావం గుండె సంబంధిత వ్యాధులతో పాటు డయాబెటీస్‌పై తీవ్రంగా ఉంటుందన్నారు. గురకతో కూడిన నిద్రను భారతీయులు సంతృప్తికరమైనదిగా భావిస్తుంటారని, అయితే ఇది ఎన్నో తీవ్రమైన సమస్యలకు మూలమని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.

ఎదురయ్యే సమస్యలు
సరైన నిద్ర లేకపోతే బరువు పెరగడంతో పాటు కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది. 
నిద్రలేమితో గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. 
నిద్రను బలవంతంగా ఆపుకోవడం వల్ల బ్లడ్‌షుగర్‌పై ప్రభావం చూపించడంతో పాటు ఇన్సులిన్‌ సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. 
తక్కువ నిద్ర భావోద్వేగంపై, సామాజిక కలివిడిపై ప్రభావం చూపుతుంది.

సానుకూలాంశాలు. 
మంచినిద్ర ఆరోగ్యంతో పాటు ఆకలిని పెంచుతుంది. 
ఉత్పాదకత పెరిగేందుకు, మరింత ఏకాగ్రతను సాధించేందుకు ఉపయోగపడుతుంది. 
మంచి నిద్రతో క్రీడాకారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. 
రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది, దీర్ఘకాలిక రోగాలతో ముడిపడిన సమస్యలు తగ్గే అవకాశం. 
జ్ఞాపకశక్తితో పాటు సృజనాత్మకతను పెంచుకునేందుకు సహకరిస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement