వరద విషాదం..43 మంది మృతి

43 people killed on heavy rains - Sakshi

ఒక్క మహారాష్ట్రలోనే 27 మంది మృతి

కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశాల్లో 16 మంది మృత్యువాత  

న్యూఢిల్లీ/బెంగళూరు/తిరువనంతపురం/సాక్షి, ముంబై/ పింప్రి: కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్నాయి. మహారాష్ట్రలో వరదల కారణంగా 27 మంది మరణించారు. ముఖ్యంగా సాంగ్లీ జిల్లాలోని పలుస్‌ తాలూకాలో వరద బాధితులతో వెళ్తున్న బోటు బోల్తా పడటంతో 9 మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో 9 మంది, కేరళలో నలుగురు, తమిళనాడులోని కోయంబత్తూరులో ఇద్దరు, ఒడిశాలో ఒకరు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు చరిత్రలోనే అత్యధికంగా నీలగిరి జిల్లా అవలాంచి అడవుల్లో 82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.  వివిధ రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకున్న లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లు నేలమట్టం కావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వానలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్డు, రైల్వే రవాణా స్తంభించింది. వరద బాధిత రాష్ట్రాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ పిలుపునిచ్చారు.

ఐదు జిల్లాల్లో అత్యధిక ప్రభావం
మహారాష్ట్రలోని పుణే, సతారా సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్‌ జిల్లాల్లో వరదల కారణంగా ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు పుణే డివిజన్‌ కమిషనర్‌ దీపక్‌ మైసేకర్‌ తెలిపారు. ముఖ్యంగా సాంగ్లీ పలుస్‌ తాలుకాలో కృష్ణా, యేర్లా నదీ సంగమంలో వరద తీవ్రతకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ఉదయం పలుస్‌ గ్రామస్తులను తరలిస్తున్న బోటు బోల్తా పడింది. దీంతో 14 మంది గల్లంతు కాగా 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. సహాయక సిబ్బంది 9 మృతదేహాలను వెలికితీశారు.

సాంగ్లీ జిల్లా జైలు వరద నీటిలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆ ప్రాంతానికి విమానంలో వెళ్లి రక్షణ, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో ఫోన్‌లో మాట్లాడారు. సాంగ్లీలో పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ఆల్మట్టి డ్యాం నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరారు. వరదల కారణంగా కొల్హాపూర్‌–మిరజ్‌ మార్గంలో రైళ్లను రద్దు చేశారు. పుణే–బెంగళూర్‌ జాతీయ రహదారి దెబ్బతినడంతో పుణే–షోలాపూర్‌ రహదారి మీదుగా వాహనాలను మళ్లించారు.  

సాయం అందించండి: యడియూరప్ప
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు 9 మంది చనిపోగా 43 వేల మంది నిరాశ్రయులయ్యారు.  ముఖ్యమంత్రి యడియూరప్ప బెళగావిలో మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.5వేల కోట్లు అవసరమవుతాయని, దాతలు ముందుకు రావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సుధామూర్తి రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు.  కేరళలోని ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలు, కొండచెరియాలు విరిగిపడటంతో ఏడాది చిన్నారి సహా నలుగురు మృతి చెందారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top