
తిరువనంతపురం/లక్నో: దేశవ్యాప్తంగా ప్రకృతి ప్రకోపానికి 23 మంది చనిపోయారు. భారీ వర్షాలు, కొండచరియలు కేరళలో బీభత్సం సృష్టించగా, యూపీలో పెనుగాలులు భారీగా ప్రాణ నష్టం కలిగించాయి. మరోవైపు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మణిపూర్, మిజోరాం అతలాకుతలమయ్యాయి. యూపీలో 15 మంది, కేరళలో నలుగురు, ఈశాన్య రాష్ట్రాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కేరళలో కురుస్తున్నభారీ వర్షాలకు కోజికోడ్ జిల్లా తమరస్సెరి తాలుకాలోని కట్టిపారా గ్రామంలో గురువారం కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు చిన్నారులున్నారు. మరో 10 మంది గల్లంతయ్యారు. దీంతో ఇప్పటి వరకు వర్ష సంబంధ ఘటనల్లో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 27కు పెరిగిందని ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ వెల్లడించారు. కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వాయనాడ్, కసర్‌గాడ్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి.
ఈశాన్యంలో కుండపోత..
గత మూడురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. నలుగురు మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తక్షణమే మరిన్ని మిలిటరీ, ప్రకృతి విపత్తు నిర్వహణ బృందాలను పంపాలని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవదేవ్ విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పొరుగు రాష్ట్రమైన మణిపూర్‌లో వరదల కారణంగా రాజధాని ఇంఫాల్, ఇతర ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు శుక్రవారం వరకూ సెలవు ప్రకటించారు.