స్వదేశానికి 20 మంది మత్స్యకారులు

20 fishermen to the Homeland - Sakshi

పొరపాటున పాకిస్తాన్‌ జలాల్లోకి ప్రవేశించి అరెస్టయిన ఉత్తరాంధ్ర జాలర్లు 

గత 14 నెలలుగా పాకిస్తాన్‌ జైల్లో మగ్గుతున్న వైనం 

వాఘా సరిహద్దు వద్ద మత్స్యకారులకు స్వాగతం పలికిన మంత్రి మోపిదేవి 

నేటి సాయంత్రం విశాఖపట్నానికి  విమానంలో పంపేందుకు ఏర్పాట్లు  

సాక్షి, న్యూఢిల్లీ: గత 14 నెలలుగా పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న 20 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఎట్టకేలకు సోమవారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. గుజరాత్‌ తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్తాన్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో వీరంతా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. మత్స్యకారులు తాము బందీలుగా ఉన్న మాలిర్‌ జిల్లా జైలు నుంచి ఆదివారం సాయంత్రం విడుదలయ్యారు. వారిని పాకిస్తాన్‌ అధికారులు కరాచీ నుంచి లాహోర్‌ వరకు రైలులో తీసుకొచ్చారు. అనంతరం సోమవారం రాత్రి 7 గంటలకు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతాదళానికి అప్పగించారు. జాలర్లను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లేందుకు వచ్చిన మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి స్వాగతం పలికి స్వీట్లు తినిపించారు. ఈ 20 మందిని మంగళవారం ఉదయం ఢిల్లీ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వారు మీడియాతో మాట్లాడాక సాయంత్రం విమానంలో విశాఖపట్నం పంపనున్నారు. 

స్వదేశం చేరుకున్న ఉత్తరాంధ్ర జాలర్లు వీరే: ఎస్‌.కిశోర్, ఎన్‌.ధన్‌రాజ్, గురుమూర్తి, రాంబాబు, ఎస్‌.అప్పారావు, జి.రామారావు, బి.అప్పన్న, ఎం.గురువులు, ఎన్‌.అప్పన్న, ఎన్‌.నర్సింగ్, వి.శామ్యూల్, కె.ఎర్రయ్య, డి.సూర్యనారాయణ, కె.మణి, కె.వెంకటేశ్, ఎస్‌.కల్యాణ్, కె.రాజు, బి.బవిరుడు, సన్యాసిరావు, సుమంత్‌.

మత్స్యకారులకు అండగా ఉంటాం
మత్స్యకార కుటుంబాలు ప్రజాసంకల్ప యాత్రలో తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పాకిస్తాన్‌లో బందీలుగా ఉన్న తమ కుటుంబ సభ్యులను కాపాడాలని విన్నవించారని మంత్రి మోపిదేవి చెప్పారు. ఆయన ఆదేశాలతో అప్పటి నుంచే తమ పార్టీ ప్రత్యేక చొరవ చూపి విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపిందన్నారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ.. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరపడంతో మత్స్యకారులు విడుదలయ్యారని వెల్లడించారు. ఇది వారికి పునర్జన్మ అని, ఇప్పటికైనా విడుదల కావడం సంతోషకరమన్నారు. మత్స్యకారులంతా సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉన్నామని చెప్పారన్నారు. వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మరో ఇద్దరు మత్స్యకారులు డాక్యుమెంట్లు, తదితర సాంకేతిక కారణాలతో విడుదల కాలేదని, వారిని కూడా విడుదల చేయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, పాకిస్తాన్‌లో భారత మత్స్యకారులు మరో 237 మంది వరకు ఉన్నారని అక్కడి అధికార వర్గాలు తెలిపినట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top