కంట్రోల్‌ తప్పి మాట జారా.. క్షమించండి : హీరో

Vishwaksen remorse on his comments over Instagram video - Sakshi

ఫలక్‌నుమాదాస్‌ సినిమాపై సోషల్‌మీడియాలో నెగటివ్‌ ప్రమోషన్‌ చేస్తున్నవారిపై హీరో విశ్వక్‌ మండిపడ్డారు. 80 మంది కొత్తవారిని పెట్టి రెండు సంవత్సరాలు కష్టపడి సొంత డబ్బుతో సినిమా తీస్తే, పనిగట్టుకుని నెగటివ్‌ ప్రమోషన్‌ చేయడంతో కంట్రోల్‌ తప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో మాట జారానని అన్నారు. అందుకు సారీ చెబుతున్నానని చెప్పారు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో చివరి 6 సెకన్లు ఎవరిని తిట్టానని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

'నేను ఏ రివ్యూ రైటర్‌ను తిట్టలేదు. ఏ మీడియాను, ఏ హీరోను ఉద్దేశించి అలా అనలేదు. మూడు రోజుల నుండి సినిమాకు సంబంధించి 180 పైరసీ లింకులను పెట్టారు. ఇంటర్‌నెట్‌లో తీసేసినా, మళ్లీ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు సహకరించిన ఫిలించాంబర్‌ సైబర్‌ క్రైమ్‌కు కృతజ్ఞతలు. పోస్టర్‌లు చింపడం, నెగటివ్‌ పబ్లిసిటీ, పైరసీ వల్ల సినిమాకు నష్టమొచ్చిందని క్లియర్‌గా కనిపిస్తుంటే, కంట్రోల్‌ తప్పి మాట జారా. అందుకు సారీ చెబుతున్నా. అలా అనాల్సి ఉండొద్దు. మూడు రోజుల నుండి నిద్రలేకుండా గడుపుతున్నా. ఒకరిని దృష్టిలోపెట్టుకుని మాట్లాడితే, హైప్‌ వస్తుంది కామెంట్‌ చేసే వాడిని కాదు. నా సినిమాతోనే పేరు రావాలని అనుకునే వాడిని కానీ, చీప్‌ ట్రిక్స్‌తో ఒకరిని తిట్టితే పైకొస్తమనుకునే వాడిని కాదు. అలాంటి ఉద్దేశ్యం లేదు' అని విశ్వక్‌ తెలిపారు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top