బీజేపీ నేత రాజాపై విశాల్‌ ఫైర్‌

Vishal Fire on BJP Leader Raja - Sakshi

సాక్షి, చెన్నై : మెర్సల్‌ సినిమాలో అభ్యంతరకర డైలాగులను తొలగించేందుకు నిర్మాతలు సిద్ధమైనప్పటికీ.. వివాదం ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఈ విషయంలో చిత్ర యూనిట్‌కు ఊహించని మద్దతు లభించింది. తమిళనాడుకే చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు మెర్సల్‌ డైలాగులు ఏ మాత్రం తప్పు కాదని వ్యాఖ్యానించారు. 

దక్షిణ చెన్నై బీజేపీ విభాగానికి చెందిన సీనియర్‌ నేత సిధార్త్‌ మణి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మెర్సల్‌లో జీఎస్టీ వ్యతిరేక డైలాగులు తప్పేం కాదని చెప్పారు. అది చిత్ర యూనిట్‌ అభిప్రాయం. సినిమా మూలంగా గౌరవం దెబ్బతింటుందన్న వాదన అస్సలు సరికాదు. అనవసరంగా పార్టీకి ఆపాదించి ఈ సమస్యను కొందరు పెద్దది చేశారు అంటూ ఆయన సొంత పార్టీ నేతలపైనే మండిపడ్డారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్‌ రాజాపై హీరో విశాల్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. 

ఓ ఇంటర్వ్యూలో రాజా.. తాను మెర్సల్‌ సినిమా పైరసీ కాపీని చూశానని, అందులోని డైలాగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాల్‌ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఓ జాతీయ నేత అయి ఉండి ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్న పైరసీని ప్రొత్సహించటం దారుణమన్నాడు. పైగా సినిమాను పైరసీలో చూశానని చెప్పటం మరింత ఘోరమని విశాల్‌ పేర్కొన్నాడు. ‘‘మీరోక బాధ్యతగల పదవిలో ఉన్నారు. పైగా సంఘంలో గౌరవం ఉన్న పెద్ద మనిషి. పైరసీ చూశానని చెబుతున్నారు. సిగ్గు లేదా?’’ అంటూ ఘాటుగా రాజాకు చురకలంటించాడు. తక్షణమే క్షమాపణలు తెలియజేసి, పైరసీ లింకులు తొలగించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని విశాల్ ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. మరో సీనియర్‌ నటుడు పార్తీబన్‌ కూడా రాజా చేసిన పనిని తప్పుబడుతూ ఆదివారం ఓ ట్వీట్ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top