ముసుగులు తొలగించండి

Twitter lashes out at Karan Johar and Alia Bhatt for fake tears - Sakshi

‘‘ఇక చాలు నీ మాటలు.. మనిషి పోయాక ఈ మొసలి కన్నీరు ఎందుకు? నెపోటిజమ్‌ జీర్ణించుకుపోయిన మనిషివి నువ్వు. నీ ముసుగుని తొలగించు. ఆలియా.. నువ్వు కూడా?’’ అంటూ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్, కథానాయిక ఆలియా భట్‌లపై సోషల్‌ మీడియా వేదికగా పలువురు మండిపడ్డారు. వారి ఆగ్రహానికి కారణం హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం.

‘‘నువ్వు (సుశాంత్‌) ఒంటరితనం ఫీలవుతున్నావని, నీ చుట్టూ మనుషులు ఉంటే బాగుంటుందని నేనో సందర్భంలో గ్రహించాను. అయితే ఏడాదిగా నీతో టచ్‌లో లేనందుకు ఇప్పుడు నన్ను నేను నిందించుకుంటున్నాను. ఇక ఎప్పటికీ ఇలా చేయకూడదనుకుంటున్నాను. నిన్ను మిస్‌ అయినందుకు నన్ను నేను తిట్టుకుంటున్నాను’’ అని కరణ్‌ ట్వీట్‌ చేశారు.

అయితే ఇదంతా ఉత్తుత్తి బాధ అనేది పలువురి అభిప్రాయం. సినిమా నేపథ్యం లేని కుటుంబాన్నుంచి వచ్చిన సుశాంత్‌ సింగ్‌కి బాలీవుడ్‌లో వారసులకు దక్కినంత ప్రేమాభిమానాలు దక్కలేదని పలువురు ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. పైగా సుశాంత్‌ హీరోగా కరణ్‌ జోహార్‌ ప్రొడక్షన్‌లో ‘డ్రైవ్‌’ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా విడుదల గత ఏడాది పలుమార్లు వాయిదా పడింది. కరోనాలాంటి మహమ్మారి కారణంగా థియేటర్ల మూత లేనప్పుడు గత ఏడాది ఈ సినిమాని డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశాడు కరణ్‌ జోహార్‌. ‘‘అదే బాలీవుడ్‌లో సుశాంత్‌కి  మంచి బ్యాగ్రౌండ్‌ ఉండి ఉంటే ఇలా చేసేవాడివా?’ అంటూ ఇప్పుడు పలువురు విరుచుకుపడ్డారు.

కథానాయిక ఆలియా భట్‌ని కూడా విమర్శిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’లో ఓసారి ఆలియా పాల్గొన్నారు. అప్పుడు రణ్‌వీర్‌సింగ్, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, వరుణ్‌ ధావన్‌లలో ఎవరు మంచి నటుడు? అని ఆలియాని కరణ్‌ అడిగితే, ‘సుశాంత్‌ అంటే ఎవరు?’ అంది. ఇద్దరూ నవ్వుకున్నారు కూడా.

ఇక ఆదివారం సుశాంత్‌ మృతికి సంతాపంగా ‘‘నువ్వు మమ్మల్ని ఇంత తొందరగా వదిలి వెళ్లిపోయావ్‌. ఎంతో షాక్‌లో ఉన్నాను. మాటలు రావడంలేదు. నీ కుటుంబ సభ్యులకి, నిన్ను ప్రేమించేవారికి, నీ ఫ్యాన్స్‌కి సంతాపం ప్రకటిస్తున్నాను’’ అని ఆలియా ట్వీట్‌ చేసింది. అప్పుడు ‘సుశాంత్‌ ఎవరు న్నావు? ఇప్పుడు సంతాపం ప్రకటిస్తున్నావు’ అని మండిపడుతున్నారు.

వాస్తవానికి రెండు మూడేళ్లుగా హిందీ పరిశ్రమలో ‘బంధుప్రీతి’ అనే వివాదం చాలా ఎక్కువగా సాగుతోంది. ‘నన్ను బాలీవుడ్‌లో జరిగే వేడుకలకు పెద్దగా పిలవరు’ అని ఓ సందర్భంలో సుశాంత్‌ సింగ్‌ అన్న దాఖలాలు కూడా ఉన్నాయి. హిందీ పరిశ్రమలో తాను ఒంటరిని అనే భావనలో అతను ఉండిపోయాడని, డిప్రెషన్‌కి ఇదొక కారణం అయ్యుంటుందన్నది కొందరి అభిప్రాయం.

ఇక కంగనా రనౌత్, తాప్సీ, హ్యూమా ఖురేషీ లాంటివాళ్లు ఈ బంధుప్రీతి గురించి బాహాటంగానే స్పందించారు. కంగనా అయితే కరణ్‌ని ఉద్దేశించి ‘బాలీవుడ్‌ మాఫియా, ‘ఫ్లాగ్‌ బ్యారర్‌‡ఆఫ్‌ నెపోటిజమ్‌’ (బంధుప్రీతిని ముందుండి నడిపించేవాడు), స్నూటీ అండ్‌ ఇన్‌టాలరెంట్‌ (ఇండస్ట్రీలోని స్టార్స్‌ను తప్ప బయటవాళ్లను భరించలేడు)  అన్నారు. ‘‘సుశాంత్‌ సినిమాలను అవార్డు షోలకు ఎందుకు అనుమతించలేదు? ‘కాయ్‌ పోచె, ఎం.ఎస్‌. ధోని, చిచోరే’ వంటి అద్భుత సినిమాలు చేశాడు. కానీ ఎన్ని అవార్డులు ఇచ్చారు?’’ అని కూడా స్పందించారు కంగనా.

‘రంగీలా’ ఫేమ్‌ ఊర్మిళ అయితే ‘‘బంధుప్రీతి’ రూల్‌ చేస్తున్న ఈ ఇండస్ట్రీలో ప్రతిభను, హార్డ్‌వర్క్‌ని నమ్ముకుని నీలా ఒక గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. ఇంత సాధించిన నువ్వు త్వరగా వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం బాధాకరం’’ అని సుశాంత్‌ మరణం పట్ల తన ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top