
టర్కీ : తాను నటించే చిత్రాల్లో సామాజిక అంశాలు ఎంత గొప్పగా ఉంటాయో అంతే గొప్పగా సమాజంలో నలుగురితో కలిసిపోతుంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్. ఆయన మంచి సరదా మనిషి కూడా. సినిమాల్లో ఆయన చేసే కామెడీనే కాదు.. నిజ జీవితంలో ఎదుటువాళ్లు చేసే కామెడీని కూడా చాలా బాగా ఎంజాయ్ చేయగలరు. అదే నిజమని రుజువు చేసేలా ఇప్పుడో ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అది స్వయంగా ఆమిర్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో ఏముందంటే టర్కీలోని ఓ ప్రముఖ ఐస్‌క్రీం దుకాణానికి ఆమిర్ ఖాన్ వెళ్లారు. అక్కడికి వచ్చిన కస్టమర్లకు ఐస్‌క్రీం అందించేవాళ్ల సహజంగా కాసేపు ఆటపట్టించి ఆ తర్వాత ఐస్ క్రీం ఇచ్చి సంతోషపెడుతుంటారు.
అలాగే, అక్కడికి ఆమిర్ కూడా వెళ్లడంతో ఈసారి ఆయన వంతు వచ్చింది. ఐస్ క్రీం వెండర్ ఆ ఐస్ క్రీంను ఇస్తున్నట్లే ఇచ్చి ఆమిర్ ఖాన్ చేతుల్లో నుంచి లాక్కుంటుంటాడు. అలా పలుమార్లు చేస్తుంటాడు. అదంతా చాలా సరదాగా కనిపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే టీజింగ్ చేసినట్లుగా చివరకు ఆమిర్ ఖాన్ అతడు చేస్తున్న ట్రిక్కులను ఎంజాయ్ చేసి ఐస్ క్రీం తీసుకొని రుచి చూస్తూ వారందరికీ ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు. అనంతరం ఈ వీడియోను ఆయన తన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పంచుకోగా దాదాపు లక్ష లైక్‌లు, 20వేల రీ ట్వీట్‌లు, 60లక్షల వ్యూస్ వచ్చాయి.