మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

Trisha to Join The Cast of Maniratnam Ponniyin Selvan - Sakshi

మణిరత్నం దర్శకత్వంలో చెన్నై చిన్నది త్రిష నటించనుందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మణిరత్నం ఆ మధ్య సరైన సక్సెస్‌ లేక కాస్త వెనుకబడ్డారు. అయితే సెక్క సివంద వానం చిత్రంతో మళ్లీ సక్సెస్‌ రూటు పట్టారు. ఆ ఉత్సాహంతో ఒకసారి వాయిదా వేసిన భారీ చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ను తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా ప్రతిసారి ఏదో ఒక కొత్త అంశం వెలుగులోకి వస్తూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది.

ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల పొన్నియన్‌ సెల్వన్‌. ఈ నవలను ఇంతకు ముందు ఎంజీఆర్‌ నుంచి చాలా మంది తెరకెక్కించాలని ఆశ పడ్డారు. అయితే చేయలేకపోయారు. ఇప్పుడు దర్శకుడు మణిరత్నం ఒక యజ్ఞంగా ఈ చిత్రానికి తెర రూపం ఇవ్వడానికి సంకల్పించారు. యువ స్టార్స్‌ నుంచి సూపర్‌స్టార్స్‌ వరకు పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో భాగం కాబోతున్నారు. పలు భాషలకు చెందిన భారీ తారాగణంను మణిరత్నం ఎంపిక చేస్తున్నారు.

ఇప్పటికే వందియదేవన్‌గా నటుడు కార్తీ, అరుళ్‌మోళివర్మగా జయంరవి, పూంగళలిగా నయనతార, సుందరచోళన్‌గా బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, ఆదిత్త కరికాలన్‌గా విక్రమ్, కందవై పాత్రలో నటి కీర్తీసురేశ్, నందిని పాత్రలో అందాలరాశి ఐశ్వర్యరాయ్, పళవైట్టైరాయర్‌ పాత్రలో సత్యరాజ్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం. మలయాళ నటుడు జయరాం, నటి అమలాపాల్, ఐశ్వర్యలక్ష్మి కూడా ముఖ్య పాత్రల్లో నటించనున్నట్లు తెలిసింది.

తన పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించనున్న విషయాన్ని నటుడు జయరాం ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌సెల్వన్‌ చిత్రంలో నటించనుండడం తన అదృష్టం అని నటి ఐశ్వర్యరాయ్‌ ఇప్పటికే పేర్కొన్నారు. మణిరత్నం ఎప్పుడు కాల్‌షీట్స్‌ అడిగినా కేటాయిస్తానని చెప్పారు. తాజాగా సంచలన నటి త్రిష కూడా పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించనున్నట్లు తాజా సమాచారం.

ఆమెను నటింపజేసే విషయమై చర‍్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో నటించనున్న తారాగణాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రాన్ని మణిరత్నం రూ.800 కోట్ల భారీ వ్యయంతో రెండు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మద్రాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలో కలిసి నిర్మించనున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top