
ఖాకీ డ్రెస్‌కి సౌత్‌లో ఫుల్ డిమాండ్. ఎందుకంటే.. ఇప్పుడు పోలీస్ సినిమాల లిస్ట్ చాలానే ఉంది. ఖాకీ వేసుకుని, లాఠీ పట్టుకుని ‘ఆఫీసర్... ఆన్ డ్యూటీ’ అని చార్జ్ తీసుకున్న నటీనటులు చాలామందే ఉన్నారు. మరి.. రక్షకభటులుగా వీరు ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో చూడ్డానికి కొంచెం సమయం ఉంది. ఇప్పుడు ఈ ‘స్టార్ పోలీస్’ల గురించి తెలుసుకుందాం.
‘దర్బార్’ చిత్రం కోసం ముంబై పోలీస్ స్టేషన్‌లో ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలంగా చార్జ్ తీసుకున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రజనీ పోలీస్ పాత్ర చేసిన చిత్రం ఇది. ఇందులో నయనతార కథానాయికగా నటించారు. రజనీకాంత్ కూతురిగా నివేథా దామస్ నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘దర్బార్’ చిత్రం జనవరి 9న విడుదల కానుందని తెలిసింది. ‘నో పోలీస్’ అంటూ ‘సింహా’లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ని మరచిపోలేం. ఇప్పుడు ‘యస్.. ఐయామ్ పోలీస్’ అంటూ.. ‘రూలర్’లో పోలీస్ పాత్రలో కనిపించనున్నారు బాలకృష్ణ. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది.ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. అందులో ఒకటి ధర్మ అనే పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర. మరో పాత్రలో ఐటీ ఉద్యోగిగా కనిపిస్తారని సమాచారం.
వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘రూలర్’ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. ఇక ‘విక్రమార్కుడు, మిరపకాయ్, పవర్’ వంటి చిత్రాల్లో పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేసి ఆడియన్స్ చేత విజిల్స్ వేయించుకున్న రవితేజ మరోసారి ఖాకీ తొడిగారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘క్రాక్’ సినిమాలో రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఇందులో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘ఘాజీ’, 1945, భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా (హిందీ)’ చిత్రాల్లో ఇండియన్ సోల్జర్‌గా రానా కనిపిస్తారు. అయితే ‘విరాటపర్వం’ సినిమా కోసం ఆయన పోలీస్ డ్రెస్ వేసుకున్నారని తెలిసింది. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి నక్సలైట్ పాత్ర చేస్తున్నారు.
1990 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. ‘తోటి పోలీసులు నన్ను సూపర్ పోలీస్ అని పిలుస్తారు’ అలా ఎందుకు అంటారో ‘వి’ సినిమాలో చూడండంటున్నారు సుధీర్‌బాబు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు నటిస్తున్న చిత్రం ‘వి’. ఇందులో పోలీస్‌గా నటిస్తున్నారు సుధీర్‌బాబు. నాని విలన్ పాత్రలో కనిపిస్తారు. ‘వి’ చిత్రం వచ్చే ఏడాది మే 25న విడుదల కానుంది. ప్రభుదేవా తొలిసారి పోలీసాఫీసర్‌గా కనిపించనున్న చిత్రం ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’. ఈ సినిమాకు ముఖిల్ చెల్లప్పన్ దర్శకుడు. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. రూపేష్ కుమార్ చౌదరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘22’. బి. శివకుమార్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రూపేష్ పోలీస్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు హీరోలు వెండితెర పోలీసులుగా కనిపించేందుకు పోలీస్ స్టోరీస్ వింటున్నారు.