
దర్శకుడు శంకర్‌కి పక్షులంటే అంత ప్రేమ ఎందుకో మరి! ‘2.0’లో అక్షయ్‌కుమార్ పాత్రను పక్షి ప్రేమికుడి (బర్డ్ లవర్)గా రూపొందించిన ఆయన, పక్షులకు అంకితం ఇస్తూ ఓ పాటను కూడా రాయించారట! రజనీ కాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మొత్తం మూడు పాటలను స్వరపరిచారు. అందులో ఓ పాట చిట్టి రోబో (రజనీకాంత్), లేడీ రోబో (అమీ జాక్సన్) మధ్య చిత్రీకరించారు. మరో పాట ఏ సందర్భంలో వస్తుందనేది పక్కన పెడితే.. ముచ్చటగా మూడోది అక్షయ్‌కుమార్ ఇంట్రడక్షన్‌లోనూ, పక్షులపై అతనికి ఎంత ప్రేమ ఉందో తెలిపే సన్నివేశాల్లోనూ మాంటేజ్ సాంగ్‌గా వస్తుందట! త్వరలో ఈ పాటను విడుదల చేస్తారట!!
కన్‌ఫ్యూజన్... కన్‌ఫ్యూజన్!
వచ్చే ఏడాది జనవరి 25న ‘2.0’ విడుదలవుతుందా? లేదా? ఇండస్ట్రీలోనూ, రజనీకాంత్ అభిమానుల్లోనూ ఇంకా కన్‌ఫ్యూజన్ క్లియర్ కాలేదు. ఎందుకంటే... విడుదల తేదీపై ఎన్ని వార్తలొస్తున్నా చిత్రబృందంలో ఎవరూ స్పందించడం లేదు. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తవలేదనే కొత్త వార్త తెరపైకి వచ్చింది. అంతే కాదు... ముందుగా ప్రకటించినట్టు ఈ నెల 22న హైదరాబాద్‌లో టీజర్‌నీ, రజనీకాంత్ బర్త్‌డే గిఫ్టుగా డిసెంబర్ 12న చెన్నైలో ట్రయిలర్‌నీ విడుదల చేయడం కష్టమేనని చెన్నై కోడంబాక్కమ్‌లో ఓ వార్త గుప్పుమంది. బయట బోల్డంత గందరగోళం నెలకొంటే... శంకర్ అండ్ కో కామ్‌గా ఉండే బదులు, కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే పోలా!!