మూడు నెలలు సినిమా థియేటర్లు మూత

Theaters in Telangana will remain shut for the next three months - Sakshi

కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్స్‌ ఆగిపోయాయి, థియేటర్స్‌ మూత పడ్డాయి. దీంతో ఇండస్ట్రీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇకౖపై కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులను అలవాటు చేసుకోవాలని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మరి... ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్‌ను మళ్లీ ఓపెన్‌ చేయడమనే విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ  మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. (నాడు మోసం.. నేడు మౌనం!)

‘‘ఈ పరిస్థితుల్లో థియేటర్స్‌ను ఓపెన్‌ చేస్తే సమస్యలు వస్తాయి. ఒకవేళ థియేటర్స్‌ను ఓపెన్‌ చేసినప్పటికీ కరోనా భయంతో ప్రేక్షకులు రాకపోవచ్చు. అలాగే సామాజిక దూరం పాటించడం కోసం థియేటర్స్‌లోని సీటింగ్‌ విషయంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు సీటింగ్‌ విషయంలో వీలైనంత త్వరగా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. కానీ జిల్లా స్థాయి థియేటర్స్‌లో సీటింగ్‌లో మార్పులు చేస్తే వారు ఆర్థికంగా ఇబ్బందిపడొచ్చు.

ప్రస్తుతానికైతే మరో రెండు నుంచి మూడు నెలలపాటు థియేటర్స్‌ను రీ ఓపెన్‌ చేయడం పట్ల ప్రభుత్వం సానుకూలంగా లేదు. కొన్ని షరతులతో థియేటర్స్‌ ఓపెన్‌ చేయమని కొందరు అంటుంటే మరికొందరు కొంత కాలం వేచి చూద్దాం అంటున్నారు. అలాగే షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వడం పట్ల కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు తలసాని శ్రీనివాస యాదవ్‌. సో.. మరో మూడు నెలల వరకూ థియేటర్ల మూత ఖాయం అనుకోవచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top