రెండు రోజులు ముందే పండగ!

thaana serntha kootam, gulebakavali released on pongal - Sakshi

ఇక్కడ సంక్రాంతి.. అక్కడ (తమిళనాడు) పొంగల్‌... పేర్లు వేరైనా పండగ జోష్‌లో మాత్రం ఏ తేడా ఉండదు. తెలుగు బాక్సాఫీస్‌ వద్ద నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి... తమిళ బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని సినిమాలు ఉన్నాయి అంటే.. అక్కడ కూడా నాలుగే. అయితే ఇంట్రస్టింగ్‌ మేటర్‌ ఏంటంటే.. ఈ నాలుగు సినిమాలు ఒకే తేదీన.. అది కూడా పండగ రెండు రోజులు ముందే (12.01.18) విడుదల కానున్నాయి.

సంక్రాంతికి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు అందరికంటే ముందు కర్చీఫ్‌ వేసింది హీరో సూర్యానే. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘తానా సేంద కూట్టమ్‌’. తెలుగులో ‘గ్యాంగ్‌’ అనే టైటిల్‌తో రిలీజ్‌ చేస్తున్నారు. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. హిందీ చిత్రం ‘స్పెషల్‌ 26’లో ఉన్న మెయిన్‌ పాయింట్‌ ఇందులో ఉందట. సూర్య తర్వాత పండక్కి మేం వస్తున్నాం అని ఎనౌన్స్‌ చేశారు ప్రభుదేవా. కల్యాణ్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘గులేభకావళి’.

హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో సీనియర్‌ నటి రేవతి కీలక పాత్ర చేశారు. అయితే.. టైటిల్‌ చదవగానే పాత సినిమా గుర్తుకు రావచ్చు. అందుకే.. గతంలో ఇదే టైటిల్స్‌తో వచ్చిన సినిమాలకు కనెక్ట్‌ అయ్యేలా ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ ఏదో ప్లాన్‌ చేశారట చిత్రబృందం. ఇక, పొంగల్‌ సందడిలో బాక్సాఫీస్‌ వద్ద స్కెచ్‌ వేస్తున్నామని విక్రమ్‌ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు కానీ.. ఎప్పుడో కరెక్ట్‌గా చెప్పలేదు. ఫైనల్‌గా జనవరి 12న బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు రెడీ అయ్యారాయన.

విజయ్‌ చందర్‌ దర్శకత్వంలో విక్రమ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘స్కెచ్‌’. ఈ సినిమాను కేరళలో కూడా 12నే రిలీజ్‌ చేస్తున్నారు. ముగ్గురు బడా హీరోలు పండక్కి బాక్సాఫీస్‌ వద్ద కాచుకుని ఉంటే.. ఏం పర్లేదు. మా సినిమా కంటెంట్‌పై భరోసా ఉంది. సో.. పండగ బరిలో దిగేందుకు సిద్దమే అని ‘మధుర వీరన్‌’ టీమ్‌ సై అంటూ సంక్రాంతి బరిలోకి దిగారు. పీజీ ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సీనియర్‌ నటుడు విజయకాంత్‌ తనయుడు షణ్ముగ పాండియన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.

ఇవికాక.. సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందిన ‘కలకలప్పు–2’, అరవింద్‌స్వామి నటించిన ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’ సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయన్న ఊహాగానాలున్నాయి. అయితే.. ఇప్పటివరకూ ఈ చిత్రాల విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించలేదు. ఆల్రెడీ నాలుగు సినిమాలు రెడీ అయిపోవడంతో ఈ సినిమాలు రాకపోవచ్చన్నది కొందరి వాదన. పండక్కి ఎన్ని సినిమాలు విడుదలైనా చూసే తీరిక ప్రేక్షకులకు ఉంటుందన్నది మరికొందరి వాదన. మరి.. సంక్రాంతి కి ఎన్ని సినిమాలొస్తాయి? బరిలో గెలుపు ఎవరిది? ‘వెట్రి యారుక్కున్ను అంజు నాళ్‌ పొరుత్తిరిందు పార్పోమ్‌’. అర్థం కాలేదా? ‘గెలుపు ఎవరికన్నది ఐదు రోజులు వేచి చూద్దాం’ అని అర్థం.

                                                       హన్సిక, ప్రభుదేవా

                                                  షణ్ముగ

                                                     విక్రమ్, తమన్నా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top