మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే!

Tammareddy Bharadwaja Speech On Dasari Narayana Rao Memorial Trust - Sakshi

సినిమా వాళ్లు పారితోషికాలు తీసుకుంటూనే సేవ చేస్తున్నామని అంటుంటారని.. ప్రభుత్వాల నుంచి సబ్సడీలు, స్థలాలు కావాలని అడుగుతుంటారని చాలా మంది అంటుంటారు నిజమే.. కానీ, మా గురువు దాసరి నారాయణరావు నిజంగానే సేవ చేశారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. డా.దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమొరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్ తరుపున దాసరి కుమార్తె హేమాలయ కుమారి, అల్లుడు డా.రఘునాథ్‌బాబు పలువురికి గురువారం చంద్ర, రాజేష్, చందు, నాగేశ్వరరావులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.  

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘మా గురువు దాసరి గురించి గిట్టని వాళ్లు ఎన్ని చెప్పినా ముమ్మాటికి ఆయన సేవ చేశారు. తెలియకుండా ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు. ఆయనను అత్యంత సన్నిహితంగా చూశాము కాబట్టి ఆయన ఏంటో మాకు తెలుసు. మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే. దాసరి సేవల్ని ఆయన కూతురు, అల్లుడు కొనసాగించడం ఆనందాన్ని కలిగిస్తోంది’ అని అన్నారు.

ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘తన చుట్టూ వున్న వారికి సహాయం చేయాలన్న గొప్ప హృదయం దాసరిది. తండ్రి ప్రారంభించిన సేవా సంస్థను ఆయన కూతురు హేమాలయ కుమారి, అల్లుడు డా. హరనాథ్‌బాబు కొనసాగించడం నిజంగా హేట్సాఫ్. తల్లిదండ్రులు ఈ రోజుల్లో పిల్లలకు చదువునే ఆస్థిగా ఇస్తున్నారు. తన దగ్గర పనిచేసిన పిల్లలకు ఆసరాగా నిలుస్తూ వారి పిల్లల చదువులకు స్కాలర్‌షిప్‌ అందజేస్తున్నారంటే మా గురువుగారు నిజంగా చిరంజీవే. ఆయన చనిపోలేదు. మనందరిలో బతికే వున్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మనవళ్లు, దవళసత్యం, రాజేంద్రకుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కొంకపురి నాటక కళాపరిషత్‌కు దాసరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top