
అనుష్క బాటలో తమన్నా
నటి తమన్నా అనుష్క బాటలో పయనిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
నటి తమన్నా అనుష్క బాటలో పయనిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటి వరకూ పాత్రల స్వభావాలకు అనుగుణంగా తమ శారీరక భాషను మార్చుకోవడానికి కథానాయకులే ఎక్కువగా శ్రమించేవారు. అలాంటిది ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం అనుష్క 20 కిలోలకు పైగా బరువు పెరిగి కథానాయికలు పాత్రల కోసం కష్టపడతారని నిరూపించారు. తాజాగా ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. తమన్నా కూడా అనుష్క బాటలో పయనిస్తూ బరువు పెరగడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. బాహుబలి చిత్రం కోసం దర్శకుడు రాజమౌళి కండిషన్ మేరకు కత్తిసాములో శిక్షణ పొంది పోరు భూమిలోకి దిగిన తమన్నా తాజాగా తమిళంలో ఏఎల్.విజయ్ దర్శకత్వంలో అభినేత్రి అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని ప్రభుదేవా నిర్మిస్తూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో తమన్నా బరువు పెరిగి లావుగా కనిపించాలన్న దర్శకుడి నిబంధన మేరకు ఆమె బరువు పెరిగే పనిలో ఉన్నారట. సన్నబడటం కష్టం కానీ లావెక్కడం ఎంత పని అంటూ చక్కగా అన్ని రకాల వంటకాలను ఇరగదీసి తినేస్తున్నారట ఈ మిల్కీబ్యూటీ. కచ్చితమైన కొలతలతో నాజూకైన నడుముతో ఇప్పటి వరకూ అభిమానుల్ని అలరిస్తున్న తమన్నా అభినేత్రి చిత్రంలో బొద్దుగా ఎలా ఆకర్షిస్తారో వేచి చూడాల్సిందే. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను జూన్ 3న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.