'రాక్షసుడు' రివ్యూ

'రాక్షసుడు' రివ్యూ


చిత్రం - 'రాక్షసుడు', తారాగణం - సూర్య, నయనతార, ప్రేమ్‌జీ అమరన్, సముద్రకణి, పార్తీబన్, కథ - స్క్రీన్‌ప్లే అసిస్టెంట్ - డి.ఎస్. కన్మణి, మాటలు - శశాంక్ వెన్నెలకంటి, పాటలు - వెన్నెలకంటి, చంద్రబోస్, శ్రీమణి, రాకేందు మౌళి, కెమేరా - ఆర్.డి. రాజశేఖర్, ఎడిటింగ్ - ప్రవీణ్ కె.ఎల్, నిర్మాతలు - కె.ఇ. జ్ఞానవేల్ రాజా, ఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు (కృష్ణారెడ్డి), దర్శకత్వం - వెంకట్ ప్రభు

 .................................



హాలీవుడ్ సినిమాలు బాగుంటాయి. వీలుంటే, అనుకరించడానికి మరీ బాగుంటాయి. వాటిని ఎవరు తొందరగా, ఎంత మన నేటివిటీకి దగ్గరగా, కాపీ కొట్టిన విషయం కనపడకుండా ఎలా పని కానిచ్చారన్నది కీలకం. ఇంటర్నెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌ల తరంలో ఇది చాలా ఇంపార్టెంట్. కానీ, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సూర్య తాజా సినిమా ఆ సంగతి సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లుంది. హాలీవుడ్ చిత్రాలు 'ఘోస్ట్ టౌన్' 'ఘోస్ట్ బస్టర్స్' లాంటి అనేక చిత్రాల కిచిడీగా ఈ చిత్రం తయారైందని సినీప్రియులు సీన్స్ వారీగా చెబుతున్నారు.



విచిత్రం ఏమిటంటే, ఇటీవలే తెలుగులో వచ్చిన 'వారధి' చిత్రం కాన్సెప్ట్ కూడా అచ్చంగా ఇదే. చనిపోయిన వ్యక్తుల ఆత్మలు తమ తీరని కోరికలను హీరో ద్వారా తీర్చుకోవడమనే ఈ కాన్సెప్ట్‌ను అచ్చంగా ఒక చోట నుంచే రెండు భాషల్లోని ఇద్దరు వేర్వేరు దర్శకులూ 'స్ఫూర్తి'గా తీసుకున్నారని సంతృప్తిపడాలి. ఆ విషయంలో ఒక చిన్న తెలుగు చిత్రం, మరో భారీ తమిళ హీరో సినిమా కన్నా ముందే వచ్చేసిందని సంబరపడాలి.



కథ ఏమిటంటే...

మాసు అని అందరూ పిలిచే మధుసూదన్ (సూర్య) అనాథగా పెరిగిన వ్యక్తి. చిన్నప్పటి నుంచీ అతనికో ఫ్రెండ్ (ప్రేమ్‌జీ అమరన్). వీళ్ళిద్దరూ కలసి, జట్టుగా దొంగతనాలు చేస్తూ ఉంటారు. ప్రేమించిన నర్సు మాలిని (నయనతార)కి ఉద్యోగం కోసం మూడున్నర లక్షలు కావాలంటే, భారీ దొంగతనం ప్లాన్ చేస్తారు. డబ్బు కొట్టేసి, పారిపోతున్న సమయంలో పెద్ద యాక్సిడెంట్. అందులో ఫ్రెండ్ చనిపోతాడు కానీ, మృత్యువు అంచుల దాకా వెళ్ళిన హీరో ప్రాణాలతో బయటపడతాడు. ఈ అనుకోని ప్రమాదం తరువాత హీరోకు ఒక అతీతమైన శక్తి లాంటిది వస్తుంది. చనిపోయిన ఫ్రెండ్‌తో సహా అనేక ఇతర ఆత్మలు కనిపిస్తుంటాయి. తమ కోరికలను తీర్చడానికి హీరోను సాయం అడుగుతుంటాయి. హీరో ఆ ఆత్మలతో కలసి చేసే కామెడీ పనులతో కొంత సినిమా నడుస్తుంది.



ఇంతలో అచ్చం హీరో లాగానే ఉండే బిజినెస్ మ్యాగ్నెట్ శివకుమార్ (సూర్య) ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ, హీరోతో ఒకర్ని హత్య కూడా చేయిస్తుంది. అసలింతకీ ఆ ఆత్మ ఎవరు? దానికీ, హీరోకూ ఉన్న సంబంధం ఏమిటి? అన్ని ఆత్మలూ మామూలు కోరికలు కోరుతుంటే, ఈ ఆత్మ హత్యల దాకా ఎందుకు వెళుతోంది లాంటివన్నీ సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్, దాని పర్యవసానాలతో తెలుస్తుంది.



ఎలా చేశారంటే...

హీరో సూర్య ఇటు అల్లరి చిల్లరి దొంగగా, అటు ఆత్మగా ఏకకాలంలో బాగా చేశారు. కానీ, పాత్ర చిత్రణల్లోనూ, కథనంలోనూ ఉన్న లోపాల వల్ల సినిమాను తన భుజాలపై మొత్తం మోయలేకపోయారు. నయనతారది గెస్ట్‌రోల్‌కు ఎక్కువ... హీరోయిన్‌కు తక్కువ తరహా పాత్ర. సినిమాలో చాలా సేపు ఆమె లేకుండానే జరిగిపోతుంటుంది. అడపా దడపా నేనున్నానంటూ తెరపైకి వచ్చి, మెరిసి మాయమవుతుంది. సినిమా అయిపోయాక, రోలింగ్ టైటిల్స్‌లో కానీ, సూర్య, నయనతారల మధ్య మాస్ మెచ్చే గ్రూప్ సాంగ్ ప్రత్యక్షం కాదు.



హీరో మిత్రుడి వేషంలో దర్శకుడు వెంకట్ ప్రభు సోదరుడు ప్రేమ్‌జీ అమరన్ (ఇద్దరూ ఇళయరాజా తమ్ముడైన సంగీత దర్శకుడు గంగై అమరన్ కుమారులు) కాసేపు నవ్వించడానికి ప్రయత్నించారు కానీ, సక్సెస్ కాలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ వగైరా తమిళానికి సెట్ అయినట్లుగా తెలుగులో కుదరలేదు. తమిళంలోని నేటివిటీ నిండిన డైలాగుల పస తెలుగులో తర్జుమా కాదు... కాలేదు కూడా! వెరసి, తమిళ బోర్డులు తెలుగులోకి మార్చి చూపించినా, డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగే మిగులుతుంది. ఒకప్పటి తమిళ హీరో పార్తీబన్ తన భారీ కాయంతో పోలీసు అధికారిగా కనిపించారు. దర్శక - నటుడు సముద్రకణి విలన్ రాధాకృష్ణ పాత్రలో బాగున్నారు.



ఎలా ఉందంటే...

శశాంక్ వెన్నెలకంటికి అనువాద రచయితగా ఇది 200వ సినిమా. జననం... మరణం... అంటూ జీవితం తాలూకు ఫిలాసఫీని చెబుతూ సెకండాఫ్‌లో వచ్చే పాట సాహిత్యపరంగా బాగుందనిపిస్తుంది. కెమేరా పనితనం, ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఘట్టాల్లో కనిపిస్తుంది. యాక్షన్ పార్ట్, ఇతర విషయాల్లో నిర్మాణ విలువలు బాగున్నాయి. కథలో పెద్ద దమ్ము లేకపోవడం, ఆత్మల కోరికలు తీర్చే ఘట్టాలను ప్రేక్షకుణ్ణి ఆసక్తిగా కూర్చోబెట్టేలా చెప్పలేకపోవడం మైనస్. ఆ మేరకు రచన, దర్శకత్వాలను నిందించాలి.



ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయానికీ, ఆత్మల విషయం అర్థమయ్యేలా చేయడానికీ సరిపోయింది. ద్వితీయార్ధంలోనే ప్రధాన కథ నడుస్తుంది. హీరో తండ్రి ఫ్లాష్‌బ్యాక్ ఘట్టం పట్టుగా నడుస్తుంది. కానీ, అప్పటికే రిలీఫ్ లేకుండా సుదీర్ఘమైన సినిమా చూసేసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. చివరకొచ్చేసరికి, రొటీన్‌గా తండ్రి పగను కొడుకు తీర్చుకున్న ఫార్ములా చట్రంలో సినిమా ముగుస్తుంది. తండ్రినీ, తల్లినీ (ప్రణీత) చంపినవాళ్ళపై కొడుకు పగతీర్చుకోవడమనే రెవెంజ్ ఫార్ములాకు, ఆత్మల నేపథ్యం జోడించిన విసుగెత్తించే ప్రయత్నంగా 'రాక్షసుడు' మిగిలింది. మొత్తం మీద, హాలీవుడ్‌లో కాకపోయినా, కనీసం తెలుగు తెరపై 'వారధి' ద్వారా ఇప్పటికే చూసేసిన ఈ ఆత్మల కోరికలు తీర్చే కాన్సెప్ట్‌ను పెద్ద హీరో, కాస్తంత భారీ నిర్మాణ విలువలు, టెక్నికల్ అంశాలతో చూడాలనుకుంటే తెరపై రెండున్నర గంటల పైగా 'రాక్షసుడు'ను భరించవచ్చు.



 - రెంటాల జయదేవ

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top