మంచి సినిమా చూశాం అంటారు

Sundeep Kishan's Manasuku Nachindi trailer - Sakshi

‘‘రియల్‌ లైఫ్‌లో నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగా. కానీ.. ‘మనసుకు నచ్చింది’ సినిమాలో సూరజ్‌ పాత్రలో హై క్లాస్‌ అబ్బాయిగా కనిపిస్తా. నాకు అలాంటి స్నేహితులు ఉండటంతో సూరజ్‌గా సులభంగా నటించగలిగా’’ అని హీరో సందీప్‌ కిషన్‌ అన్నారు. సందీప్‌ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. సంజయ్‌ స్వరూప్, పి.కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మీడియాతో మాట్లాడుతూ– ‘‘మంజులగారు చెప్పిన కథ వినగానే చాలా ఎగై్జట్‌ అయ్యా. ప్రతి సన్నివేశం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నాకు చెప్పిన కథని మంజులగారు అలాగే తెరపైకి తీసుకురావడం గ్రేట్‌. ఇదొక ఫీల్‌ గుడ్‌ మూవీ. మనం మిస్సవుతున్న చిన్న చిన్న సంతోషాలని ఈ కథ గుర్తు చేస్తుంది. ఇటీవల నా సినిమాల్లో వినోదం మిస్‌ అవడంతో ప్రేక్షకులు సరిగ్గా ఆదరించలేదు. ‘మనసుకు నచ్చింది’లో ఫన్‌ ఉంటుంది.

రియలిస్టిక్‌ పెర్‌ఫార్మెన్స్‌ నేనిప్పటి వరకూ చేయలేదు. ఈ చిత్రంలో చేశా. పిల్లల నుంచి పెద్దల వరకూ.. ముఖ్యంగా పిల్లలకీ, మహిళలకి మా సినిమా బాగా నచ్చుతుంది. ఓ మంచి సినిమా చూశామనే భావన అన్ని వర్గాల ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ప్రస్తుతం కునాల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత నందిని పులి అనే లేడీ డైరెక్టర్‌తో లవ్‌స్టోరీ, కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో సినిమాలు చేయనున్నా’’ అన్నారు.

బషీద్‌ వల్ల నాకే ఎక్కువ నష్టం
‘‘సీవీ కుమార్‌ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘మాయవన్‌’ సినిమా తమిళంలో సూపర్‌ హిట్‌ అయింది. ఆ సినిమాని నిర్మాత ఎస్‌.కె. బషీద్‌ తెలుగులో ‘ప్రాజెక్ట్‌ జెడ్‌’ పేరుతో విడుదల చేశారు. ఆ సినిమాకి నేను తెలుగు డబ్బింగ్‌ చెప్పలేదని, దాంతో నష్టపోయానని ఆయన ఆరోపిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో నేను డబ్బింగ్‌ చెప్పా. సీవీ కుమార్‌గారికి బషీద్‌ పూర్తి డబ్బులు చెల్లించలేదు. దాంతో ఆయన డబ్బింగ్‌ వెర్షన్‌ ఇవ్వలేదు. కానీ బషీద్‌ సెన్సార్‌ ప్రింట్‌నే రిలీజ్‌ చేయడంతో ఫ్లాప్‌ అయింది. ఆ రకంగా బషీద్‌ వల్ల నాకే ఎక్కువ నష్టం. తమిళంలో హిట్‌ అయిన ఓ సినిమాని తెలుగులో చంపేశాడు బషీద్‌’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top