తారాపాతం

Special story to heroins death - Sakshi

సినిమాల్లో చనిపోతే రెండో ఆటకు బతికేస్తారు. జీవితంలో ఆడలేక చనిపోతే అదే ఆఖరి..‘షో’!ఎందుకిలా చేస్తారు ఈ అందమైన అమ్మాయిలు?పేరుండీ, డబ్బుండీ, అదృష్టం కలిసొచ్చీ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనుకుంటూ ఉండకనేఈ డర్టీ లోకం వద్దనుకునిఎక్కడికో రెక్కలు కట్టుకుని వెళ్లిపోతారెందుకు?ఎవరో డైరెక్షన్‌ ఇస్తుంటే.. నటనలో జీవించినట్లుగా.. జీవితంలో డైరెక్ట్‌ చేసే వాళ్లెవరూ లేరనేనా.. వీళ్లు మరణంలోకి తొందరపడతారు?!ఇప్పుడు మరో యువ నటి రాలిపోయింది.  ఈ బాధామయ ‘తారా’పాతం ముగిసేదెప్పటికి?

ఆన్‌ స్క్రీన్‌.. గ్లామర్‌ను పరిచయం చేస్తుంది. గ్లామర్‌.. మెప్పును మాత్రమే స్వీకరిస్తుంది.మెప్పు.. తప్పును అధిగమించే తత్వాన్ని బలహీనపరుస్తుంది.ఆన్‌స్క్రీన్‌.. గ్లామర్‌.. మెప్పు... జీవితంలో షార్ట్‌టైమే ఉండి లాంగ్‌ టైమ్‌ లైఫ్‌ను బానిసగా మలచుకుంటాయి. డిప్రెషన్‌ను అవార్డ్‌గా ఇస్తాయి. సూసైడ్‌ గమ్యంగా ప్రయాణాన్ని నెట్టుతాయి!ఎంతోమంది నటీనటుల జీవితాలు రుజువు చేసిన ఫిలాసíఫీ ఇది. ఈ మధ్యకాలంలో  ఈ కేస్‌స్టడీస్‌ పెరుగుతున్నాయి కూడా. బుధవారమే (సెప్టెంబర్‌ 5) బెంగాలీ వర్థమాన నటి పాయల్‌ చక్రవర్తి ఆత్మహత్య చేసుకొని ఈ జాబితాలోకి చేరడం తాజా సత్యం. 

పాయల్‌ చక్రవర్తి
బెంగాలీ నటి. ‘దేవ్స్‌ కాక్‌పిట్‌’లో నటించింది. ‘కేలో’ అనే సినిమా విడుదల కానుంది. పలు టీవీ సీరియళ్లలోనూ స్మాల్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. మూడు సినిమాలకు క్లాప్‌లు.. ఆరు సినిమాలకు డబ్బింగ్‌లా ఆమె కెరీర్‌ రీల్‌ రోల్‌ కాలేకపోయినా.. చేతిలో పనిలేకుండా ఏమీ లేదు. అసలు ఆమె సిలుగురి వెళ్లింది కూడా అవుట్‌డోర్‌ కోసమే. మంగళవారం సాయంత్రం సిలుగురిలోని ఓ హోటల్లో బస చేసింది. అక్కడి నుంచి ఆమె షూటింగ్‌ నిమిత్తం గ్యాంగ్‌టక్‌ వెళ్లాలి . కాని ఆమె చెప్పిన సమయానికి బుధవారం ఎంతకీ హోటల్‌ చెక్‌ అవుట్‌ చేయకపోయేసరికి హోటల్‌ సిబ్బంది వెళ్లి ఆమె గది తలుపు కొట్టారు. అయినా తెరవలేదు. దాంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి గది తలుపు తెరిచి చూసేసరికి పాయల్‌ చనిపోయి ఉంది. ఇప్పటికైతే ఆమె మరణాన్ని ఆత్మహత్యగానే భావిస్తున్నారు పోలీసులు. పాయల్‌కు పెళ్లయింది. మూడేళ్ల కొడుకూ ఉన్నాడు. కొంతకాలం కిందటే భర్తతో విడాకులు తీసుకుంది. 

ఇప్పుడు పాయల్‌.. అంతకుముందు?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి  ఫటాఫట్‌ జయలక్ష్మి అనే నటీమణి ఆత్మహత్యతో షాక్‌ తగిలింది. ఆ తర్వాత ఉలిక్కిపడ్డది దివ్యభారతి మృతితోనే. 1990లో తెలుగు వెండితెర మీద ఓ మెరుపులా మెరిసింది దివ్యభారతి.  తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమను యువరాణిలా ఏలింది. మూడేళ్లకే ఆ మెరుపు మాయమైంది. 1993, ఏప్రిల్‌లో ముంబైలోని బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆ మూడేళ్లలోనే పద్నాలుగు సినిమాలు చేసింది. బాలీవుడ్‌ నిర్మాత సాజిద్‌ నడియడ్‌వాలా ప్రేమలో పడింది. చనిపోయేనాటికి అతనితో సహజీవనంలో ఉంది. అనుమానాస్పదంగా మారిన ఆమె మృతికి సాజిద్‌తో ఉన్న స్పర్థలే కారణమని అప్పుడు వదంతులూ చాలానే వచ్చాయి. ఆ టైమ్‌కి ఆమె సినీ ప్రయాణం అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఏదేమైనా.. చక్కటి భవిష్యత్‌ ఉన్న దివ్య అర్థంతరంగా రాలిపోయింది. 

సిల్క్‌స్మిత
దివ్యభారతి మరణం తర్వాత అంతటి అశనిపాతం సిల్క్‌స్మిత సూసైడే. హీరోయిన్‌ అవుదామని వచ్చి ఐటమ్‌గర్ల్‌ ‘సిల్క్‌’గా సెటిల్‌ అయింది. ఒకానొక దశలో కథానాయికల కన్నా క్రేజ్, డిమాండ్‌ను సాధించిన సిల్క్‌ తర్వాత తర్వాత సినీ నిర్మాణంలోకీ అడుగుపెట్టి తీవ్రంగా నష్టపోయింది. అలాగే వ్యక్తిగతంగా  లవ్‌  ఫెయిల్యూరూ ఆమెను కుంగదీసింది. ఒకవైపు అప్పులు, ఇంకోవైపు ప్రేమతాలూకు మానసిక క్షోభతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. అలా ఆమె నిష్క్రమణ ఆమె అభిమానులను విషాదంలో ముంచేసింది. 

పర్వీన్‌బాబి
బాలీవుడ్‌ దివా. డెబ్భై, ఎనభైల్లో భారతీయ ప్రేక్షకుల కలల రాణి. ఆమె సెల్యూలాయిడ్‌ జర్నీ ఎంత హుషారుగా ఉండిందో పర్సనల్‌ ప్రయాణం అంత ఒడిదుడుకులుగా సాగింది.  అమితాబ్‌ బచ్చన్‌తో ప్రేమ విఫలమై బాలీవుడ్‌ డైరెక్టర్‌ మహేష్‌భట్‌ ప్రేమతో కొంత స్వాంతన పొందింది. కాని అప్పటికే స్కీజోఫ్రీనియా బారినపడి మానసికంగా చిక్కిశల్యమైంది. దాంతో మహేష్‌భట్‌ కూడా ఆమెకు దూరమయ్యాడు. ఆమె కుటుంబ సభ్యులూ ఎవరూ పట్టించుకోలేదు. మధుమేహం ఆమె దేహాన్ని ఆవరించింది. వీటన్నిటి మధ్య తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే విగతజీవిగా కనిపించింది పర్వీన్‌బాబి. అయితే మానసిక అస్వస్థతతో ఆత్మహత్య చేసుకుందని అంటారు. 

జియా ఖాన్‌
ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని మళ్లీ ఉలిక్కిపడేలా చేసింది.. జియాఖాన్‌ ఆత్మహత్యే. నిశ్శబ్ద్‌ సినిమాతో  ప్రేక్షకుల హృదయాల్లో గూడుకట్టుకొని కొలువైంది. హిందీ గజినీలో నయనతార పాత్రను పోషించింది. ఆ అమాయకమైన మొహం.. బేల చూపులు..  స్వచ్ఛమైన నవ్వు.. ఇప్పటికీ స్మృతిపథంలో స్థిరంగా ఉన్నాయి.   ఆదిత్య పంచోలి, జరీనా వాహబ్‌ (ఒకటిప్పటి హీరో, హీరోయిన్లు)ల కొడుకు సూరజ్‌ పంచోలీతో పీకల్లోతు ప్రేమలో పడింది జియా. కాని సూరజ్‌ నిర్లక్ష్యం ఆమె ప్రాణాలు తీసుకునేలా చేసింది. సూసైడ్‌ నోట్‌ రాసి మరీ 2013, జూన్‌ 3న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఊపిరి తీసుకుంది జియా ఖాన్‌. 

నఫీసా జోసెఫ్‌
ఆ పేరు వినగానే మిస్‌ ఇండియా గుర్తొస్తుంది. అవును నఫీసా 1997 మిస్‌ ఇండియా. ఆ యేడు మిస్‌యూనివర్స్‌ సెమీ ఫైనలిస్ట్‌ కూడా. మోడల్, వీడియో జాకీ అయిన నఫీసా 2004లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కారణం.. నఫీసాతో డేటింగ్‌లో ఉన్న ఆమె బాయ్‌ఫ్రెండ్‌ తనకు అంతకుముందే పెళ్లి అయింది కాని విడాకులు తీసుకున్నాను అని చెప్పాడట. కాని ఇంకా మొదటి భార్యతో కలిసే ఉంటున్నాడన్న నిజం తెలిసి కుప్పకూలింది నఫీసా. కలతచెంది బలన్మరణానికి పాల్పిడింది. 

కుల్‌జీత్‌ రాంధ్వా
నటి, టాప్‌ మోడల్‌గా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా లీడ్‌ చేసినా వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేక ఆత్మహత్యతో అంతం చేసుకుంది. గ్లామర్‌ లైఫ్‌ ఫెయిల్యూర్‌గా నిలిచింది. అదే విషయాన్ని సూసైడ్‌ లేఖలో రాసి 2006, ఫిబ్రవరి 8న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణం తీసుకుంది. 

ప్రత్యూషా బెనర్జీ
బాలికా వధు.. టీవీ సీరియల్‌లోని ‘ఆనంది’గా ప్రతి గడపా ఆదరించిన ప్రత్యూషా బెనర్జీ కూడా జీవితంలోని గడ్డు కాలాన్ని గట్టెక్కే స్థయిర్యం లేక ఆత్మహత్యను శరణుజొచ్చింది. జంషేడ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల ప్రత్యూషా సహనటుడు రాహుల్‌రాజ్‌తో లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉంది. అతనితో వచ్చిన కలహాల కారణంగానే ప్రాణాలు తీసుకుంది. 

వివేకా బాబాజీ
మారిషస్‌లో పుట్టిన మహారాష్ట్రియన్‌ వివేకా. కమర్షియల్‌ ప్రొడక్ట్స్‌ ఎన్నింటికో మోడల్‌గా పనిచేసిన వివేకా ‘‘యే కైసీ మొహబ్బత్‌ హై’’ అనే సినిమాలోనూ నటించింది. బాంద్రాలోని తన ఫ్లాట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. విజయ శిఖరం మీద అట్టేసేపు నిలబడ్డానికి చోటు ఉండదు. అందుకే గెలిచిన వాళ్లు గెలుపు సుస్థిరం కాదనే విషయాన్ని అర్థంచేసుకోవాలి. అంతే జాగ్రత్తగా దిగడమూ నేర్చుకోవాలి. అలాగే ఓటమి కూడా జీవితంలో భాగమే.. గ్లామర్‌ ఓ మేకప్‌ మాత్రమే అని అనుభవంలోకి రావాలి. బతకడం ఒక్కటే ప్రాక్టికాలిటీ అనే నిజం గుర్తెరగాలి. అప్పుడే సమస్యలన్నీ తేలికవుతాయి. జీవితం స్ట్రాంగ్‌ అవుతుంది. 
– శరాది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top