ప్రయోగాలు ఫలిస్తున్నాయి..!

Special Story on experimental films - Sakshi

ఎవరెన్ని మాటలు చెప్పిన సినిమా అంటే వ్యాపారమే. ఇక్కడ లాభనష్టాలే ముఖ్యభూమిక పోషిస్తాయి. అందుకే కమర్షియల్ ఫార్ములా సినిమాలకే మన సినీ ప్రముఖులు ఓటేస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలంటే కోట్లతో పని ఏ మాత్రం పొరబాటు జరిగినా భారీ నష్టాలు తప్పవు. అందుకే యంగ్ హీరోల స్థాయిలో సీనియర్ హీరోలు ప్రయోగాలకు ముందుకు రారు.

అయితే అడపాదడపా ప్రయోగాలకు ఓకె చెపుతున్న మన హీరోలు మంచి విజయాలే సాధిస్తున్నారు. తాజాగా రాజుగారి గది 2తో నాగార్జున మరోసారి తన నిర్ణయం సరైనదే అని ప్రూవ్ చేసుకున్నారు. తెలుగు తెర మీద హర్రర్ కామెడీలో మంచి విజయాలు సాధించాయి. అయితే ఈ జానర్ లో స్టార్ హీరోలు మాత్రం ఇంతవరకు నటించలేదు. హీరోయిజానికి పెద్దగా అవకాశం లేకపోవటంతో స్టార్ హీరోలు ఈ తరహా సినిమాలపై ఆసక్తి కనబరచలేదు. తొలిసారిగా నాగ్ ఆ సాహసం చేశాడు. హర్రర్ కామెడీ లో నటించిన నాగ్ తన స్టైల్ తో అలరించి మంచి విజయాన్ని అందుకున్నారు.

ఇటీవల సూపర్ హిట్ అయిన మరో ప్రయోగం అర్జున్ రెడ్డి. తెలుగు సినీరంగంలో శివ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అర్జున్ రెడ్డి కూడా అదే స్థాయిలో హాట్ టాపిక్ మారింది. తొలి పోస్టర్ నుంచే సంచలనంగా మారిన అర్జున్ రెడ్డి, రిలీజ్ తరువాత మరిన్ని వివాదాలకు తెరతీయటంతో పాటు అదే స్థాయిలో వసూళ్లనూ సాధించింది. కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన బోల్డ్ ప్రయత్నం తెలుగు సినిమాకు కొత్త పంథాను చూపించింది.

రొటీన్ యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్న ఫార్ములాను బ్రేక్ చేసిన దర్శకులు కూడా మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కథా భావోద్వేగాలే ప్రధాన బలంగా సినిమాలు తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల కూడా మంచి విజయాలు సాధిస్తున్నారు. ఆనంద్, హ్యాపీడేస్ లాంటి సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల ఇటీవల ఫిదా సినిమాతో మరోసారి ఆడియన్స్ ను ఫిదా చేశారు. తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయిల ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఆర్భాటాలు లేకపోయినా.. ఘనవిజయం సాధించింది.

హీరోయిజాన్ని సరికొత్త కోణంలో చూపిస్తున్న దర్శకులు కూడా మంచి విజయాలు సాధిస్తున్నారు. హీరో అంటే సకల కళాభిరాముడన్న ఫార్ములాను పక్కన పెట్టి, మతిమరుపు, నిరుద్యోగి లాంటి ఇబ్బందుల్లో ఉన్న క్యారెక్టర్లను కూడా హీరోలుగా చూపించి విజయాలు సాధిస్తున్నారు. భలే భలే మొగాడివోయ్ సినిమాలో నానీని మతిమరుపు వ్యక్తిగా చూపించిన మారుతి, పెళ్లిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండను నిరుద్యోగిగా చూపించిన తరుణ్ భాస్కర్ లు ఘనవిజయాలు సాధించారు.

పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్ లో సాగిపోతున్న సినిమాను కళాత్మకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నవారూ లేకపోలేదు. దర్శకుడు క్రిష్ ఈ కోవలోకే వస్తారు. గమ్యం నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టిన క్రిష్ తన ప్రతీ సినిమాలో ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కంచె, వేదం లాంటి సినిమాలతో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా.. దర్శకుడిగా మాత్రం ప్రతీ సినిమాకు ఎదుగుతూ వచ్చారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి తో తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించి మంచి ప్రయోగాలను తెలుగు ప్రేక్షకులు ఆదారిస్తారని మరోసారి నిరూపించాడు.

ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోన్న నేపథ్యంలో హీరోలు, దర్శకులు కొత్త కథలకు ప్రయోగాలకు రెడీ అంటున్నారు. ఇటీవల వస్తున్న సినిమాలు చూస్తుంటే ఇప్పటికే స్టార్ హీరోలు కూడా ఆ దిశగా అడుగులు వేయటం ప్రారంభించారన్న విషయం స్పష్టమవుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top