యాత్ర ఒక బాట.. ఒక మాట

Special chit chat with mammootty - Sakshi

మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిప్రతి పథమూ ఒక గొప్ప యాత్ర. నడక భరోసా ఇవ్వాలి.నడత స్ఫూర్తిని కలిగించాలి. ఇది జనం నచ్చిన యాత్ర.. జగం మెచ్చిన యాత్ర.

‘‘మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే.’’‘‘జనాలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఉంది. వినాలనీ ఉంది. కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది.’’‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’’‘యాత్ర’ చిత్రంలోని ఈ సంభాషణలు వింటే చాలు.. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వం, పట్టుదల తెలియడానికి. ప్రజలకు మేలు చెయ్యాలన్న నాయకుడని చెప్పడానికి! మండుటెండలో నాయకుడు నడుస్తుంటే.. మనమెందుకు ఆ ఎండలోకి వెళ్లాలని ప్రజలు అనుకోకుండా.. ఆయన్ని కలిసేందుకు.. తమ బాధల్ని చెప్పుకునేందుకు అడుగులో అడుగేశారు. ‘‘అలాంటి వ్యక్తినిరాజకీయ నాయకుడని అనరు. ప్రజా నేత అని పిలుస్తారు’’ అని చెబుతున్నారు.. మమ్ముట్టి. ‘యాత్ర’ సినిమాతో తెలుగుతెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మమ్ముట్టి.. జనం గుండెచప్పుడని చెప్పే రాజన్న రాజసాన్ని మరోసారి ప్రజలకు పరిచయం చేశారు. వైఎస్సార్‌ అంతరంగాన్ని ఆకళింపు చేసుకొని మరీ నటించి.. నడుస్తున్న చరిత్రగా రాజన్న ప్రజాప్రస్థానాన్ని ప్రజలకు అందించిన మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టితో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.

 ‘యాత్ర’ సినిమా ఘనవిజయం సాధించినందుకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్‌.
మమ్ముట్టి: థ్యాంక్యూ. ఇది ‘యాత్ర’ యూనిట్‌ విజయం. అంతకుమించి ప్రజలది. అన్నింటికన్నా.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వానిదీ విజయం.

 సుమారు నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు చూశారు. ఈ సినిమా సక్సెస్‌ ఎలాంటి అనుభూతిని ఇస్తోంది?
ఇది నాకు స్పెషల్‌ సినిమా. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలోని ఓ భాగాన్ని కథగా రూపొందించి మలచిన చిత్రమిది. దీన్ని బయోపిక్‌ అనలేం. వైఎస్సార్‌ లైఫ్‌లోని ఓ ఈవెంట్‌ బేస్డ్‌ స్టోరీ అని కూడా అనుకోలేం. ఎందుకంటే ఆయన ప్రజా ప్రస్థాన యాత్ర ఓ నడుస్తున్న చరిత్ర. అందుకే.. అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

350 సినిమాల కెరీర్‌లో మీకు కాంప్లిమెంట్స్‌ కొత్త కాదు. ఈ సినిమాకు మాత్రం సామాన్యుల నుంచి సినీ దిగ్గజాల వరకూ ప్రతి ఒక్కరూ మీ నటనను ప్రశంసిస్తున్నారు. మమ్ముట్టి తప్ప మరెవర్నీ ఈ క్యారెక్టర్‌లో ఊహించుకోలేక పోతున్నామంటున్నారు. మీరెలా ఫీలవుతున్నారు.?
ఎవరి నటనతో వారు మెప్పించగలరు. నాకు అవకాశం వచ్చింది. నేను నటించాను. అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. అయితే సక్సెస్‌కు పొంగిపోవడం నాకు రాదు. చాలా రోజుల తర్వాత తెలుగులో నటించాను. ఈ చిత్రకథ, డైరెక్టర్‌ మహి కథ చెప్పిన విధానం నన్ను ఇంప్రెస్‌ చేసింది. నటించేందుకు ఎక్కువ స్కోప్‌ ఉన్న సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పాను. 

డైరెక్టర్‌ మహి కథ చెప్పక ముందు వైఎస్సార్‌ గురించి మీకు ఏం తెలుసు.?
ఒక పౌరుడిగా సమకాలీన రాజకీయాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. ఆ సందర్భంలోనే  వైఎస్సార్‌ రాజకీయ ప్రస్థానం గురించి చాలాసార్లు విన్నాను. న్యూస్‌లోనూ, పత్రికల్లోనూ ఆయన అద్భుతమైన పాలన గురించి చూశాను, చదివాను. ఆయన వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకున్నాను. 

వైఎస్సార్‌ను ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా మీరు చూడలేదు. కానీ ఆయన రాజసం, మాటల్లో గాంభీర్యం, నడకలో తెగువ, చేయి ఊపడం.. అన్నీ ఎలా పండించగలిగారు?
వైఎస్సార్‌ను ఇమిటేట్‌ చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయనలా నడవాలని, ఆయనలా మాట్లాడాలని ప్రతి సీన్‌కు ముందు అనుకోలేదు. నా సినీ అనుభవంతో నేను వైఎస్సార్‌ అనే పాత్రలో నటిస్తున్నాను కాబట్టి.. ఆ క్యారెక్టర్‌ ఇలా ఉంటుందని ఊహించుకొని నటించాను. అయితే ఆ సీన్లన్నీ చరిత్రలో ఏం జరిగాయో, ఆయన హావభావాలు ఎలా ఉన్నాయో.. అచ్చం అలా వచ్చేశాయి. యాదృచ్ఛికంగా  వైఎస్సార్‌ బాడీ లాంగ్వేజ్, నేను నటించిన విధానం ఒకేలా రావడం ఆశ్చర్యం.

‘యాత్ర’ సినిమా కథ వినక ముందు వైఎస్సార్‌పై మీ అభిప్రాయం, కథ విన్న తర్వాత, సినిమా చేసిన తర్వాత ఆయన పై మీ అభిప్రాయం ఎలా ఉంది.?
చూడండి.. నేను ఒక సామాన్య పౌరుడిగా దేశ రాజకీయాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. అయితే ఏపీ రాజకీయాల గురించి అంతగా అవగాహన లేదు. కానీ రాజశేఖర్‌రెడ్డి లీడర్‌షిప్‌ గురించి మాత్రం కొంత తెలుసు. ‘యాత్ర’ కథ విన్నాక పూర్తిస్థాయి అవగాహన వచ్చింది. వైఎస్సార్‌ క్యారెక్టర్‌ నచ్చింది కాబట్టే ‘యాత్ర’ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను.

ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఎమోషన్‌ ఉంది. మీకు హార్ట్‌ టచింగ్‌ అనిపించిన ఎమోషనల్‌ సీన్‌ ఏది?
ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల కోసం జీవిస్తూ, వారి ఎమోషన్లను పంచుకునే ప్రతి నాయకుడూ సక్సెస్‌ అవుతాడు. రాజశేఖర్‌రెడ్డి ఈ కోవకు చెందిన వారే. తెలుగు ప్రజలందరిలోనూ వైఎస్సార్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిపోయారు. రాజన్న మనకోసం ఉన్నాడు, మనకు ఉపకారం చేసేందుకు వచ్చాడు, మన బాధలు తీర్చే నాయకుడని విశ్వసించారు. అందుకే సినిమాలో నటించేటప్పుడు నేను ఆ ఎమోషన్‌ను చూపించాలని అనుకున్నాను. సక్సెస్‌ అయ్యాను. సినిమా చూసినంతసేపూ  ప్రేక్షకులు ‘అతను మన రాజశేఖర్‌రెడ్డి.. మన జీవితాల్ని బాగుచేసింది ఈయనే’ అన్న ఉద్వేగానికి గురయ్యారు. అందుకే ప్రతి సన్నివేశం ప్రజల హృదయాల్ని హత్తుకునేలా ఉంది. అదే ఫీలింగ్‌ నాలోనూ ఉండిపోయింది. ఒక సన్నివేశం అని కాదు.. సినిమా మొత్తం నాకు నచ్చింది. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ప్రజలకు కాన్ఫిడెన్స్‌ ఇచ్చిన నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.

ఒక రాజకీయ నాయకుడి గురించి సినిమా అంటే.. ఆయన అభిమానులు, పార్టీకి సంబంధించిన వారికే నచ్చుతుందని భావిస్తారు. కానీ.. ‘యాత్ర’ మాత్రం అన్ని వర్గాల వారి హృదయాల్ని కదిలించింది. కన్నీళ్లు పెట్టించింది. ఇంతటి ఘన విజయం ఊహించారా?
వైఎస్సార్‌ జీవిత చరిత్ర మొత్తం చెప్పిన కథ కాదు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఓ రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్తూ చేసిన పాదయాత్ర అనే భాగం. పాదయాత్రకు మునుపు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు పాదయాత్ర ఎందుకు చెయ్యాల్సి వచ్చింది, సుదీర్ఘ పాదయాత్ర ఎలా చేశారు? ఆయన పాదయాత్ర చేసిన నాటికి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, ఆయన వాటిని వింటూ, భరోసా ఇచ్చిన విధానం గురించి ప్రజలకు వివరించిన చిత్రమిది. పార్టీ గురించి కాకుండా ప్రజల గురించి చేసిన పాదయాత్ర కావడం.. ఆ విశేషాలను చక్కని స్క్రీన్‌ప్లేతో కళ్లకు కట్టినట్లు చూపించడం వల్లే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు.

50 ఏళ్లు దాటాక సుదీర్ఘ పాదయాత్ర చెయ్యడం, అదీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం.. ఏ రాజకీయ నాయకుడికైనా సాధ్యమని మీరు భావిస్తారా.?
పాదయాత్ర అంటే కేవలం అలా నడుచుకుంటూ వెళ్లిపోవడం కాదు. వెయ్యి, రెండు వేల కిలోమీటర్లు నడిచి వెళ్లిపోవడం కాదు. ఆ యాత్రలో ఏం జరిగింది? ప్రజలను ఎలా కలుసుకున్నారు? వారి బాధలు ఎలా తెలుసుకున్నారు? నడిచి వస్తున్న నాయకుడ్ని ప్రజలు ఎలా ఆదరించారన్నది ముఖ్యం. ఏదో నడిచాం.. మాట్లాడాం అన్నది కాదు. వారి బాధల్ని మర్చిపోయేలా భరోసా ఇవ్వడం.  వారికోసం ఏం చేస్తామో కుండబద్దలుకొట్టినట్లు వైఎస్సార్‌ చెప్పారు. అందుకే యాత్ర తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు నమ్మారు. ఆ వయసులో తమ కోసం నడిచి వచ్చి.. తమ బాధలు వినేందుకు రావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు వచ్చాడని ఆనందపడ్డారు.

రాజకీయాలకు అతీతంగా సాగుతున్న ‘యాత్ర’ సినిమా విజయం గురించి ఒక్కమాటలో చెప్పండి.?
ఇది రాజకీయ నాయకుడి సినిమా కాదు. ప్రజా నాయకుడి చిత్రం. అందుకే అందరూ ఆదరిస్తున్నారు.

మలయాళం, తమిళ ప్రజలు కూడా యాత్రను ఆదరిస్తున్నారు కదా..
అవును. తెలుగులో విజయం సాధించిందంటే.. రాజశేఖర్‌రెడ్డి గురించి తెలుసు అనుకోవచ్చు. కానీ.. తమిళం, మలయాళంలోనూ ప్రజలు ‘యాత్ర’ సినిమాను ఆదరిస్తున్నారు. ఎందుకంటే వైఎస్సార్‌ అనే ఓ ప్రజానేత గురించి చెప్పిన చిత్రమిది. ఒక పొలిటికల్‌ లీడర్‌... పీపుల్స్‌ లీడర్‌గా ఎలా మారాడన్నది తెలుసుకున్న ప్రజలు సినిమాను బ్రహ్మరథం పడుతున్నారు. 

కొత్త జనరేషన్‌కు వైఎస్సార్‌ వ్యక్తిత్వాన్ని చూపించారు. రాజశేఖర్‌రెడ్డి గురించి తెలియని యువతకు ‘యాత్ర’ సినిమా చూపిస్తూ ఇలా ఉండేవారు అని చెబుతున్నారు
నిజమే. నేనూ విన్నాను.. కొత్త జనరేషన్‌ వైఎస్సార్‌ పేరు, ఆయన ఏం చేశారు అనేవి మాత్రమే విని ఉంటారు. యాత్రలో చూపించిన ప్రతి సన్నివేశం యువతను ఆకట్టుకుంటోందని ప్రజలు చెబుతున్నారు. 

సినిమాలోని డైలాగ్స్‌ ప్రేక్షకులకు కన్నీరు తెప్పించాయి. ఆ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యారు?
రైతుల కోసం ఓ డైలాగ్‌ ఉంటుంది. ఈ యాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న రైతుల్ని చూశాను.. వాళ్ల కన్నీళ్లతో కూడా తడవని నేలని చూశాను. జీవంలేని ఆ భూముల్ని చూసి ప్రాణం వదిలిన ఎంతో మంది రైతుల్ని చూశాను. నేను విన్నాను.. నేను ఉన్నాను.. ఇది చాలా ఉద్వేగమైన సంభాషణ. నిజమే కదా.. నాయకుడంటే ప్రజలు తయారు చేసినవాడే. ఎండలో పనిచేసే ప్రతి పేదవాడికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని భావించిన రాజశేఖర్‌రెడ్డి యాత్ర చేశారు.

మీరు నటించిన సినిమాల్లో పంచెకట్టు ఉంటుంది. వైఎస్సార్‌ పంచెకట్టు ఎలా అనిపించింది?
పంచెకట్టు నేను నటించిన చాలా సినిమాల్లో ఉంది. అయితే ‘యాత్ర’ లో పంచెకట్టు ప్రత్యేకంగా ఉంది. అది కూడా సినిమాకు ప్లస్‌ అయ్యింది.

సినిమాలో మీ క్యారెక్టర్‌ కాకుండా.. ఇంకా ఏ క్యారెక్టర్‌ మీకు బాగా నచ్చింది.?
అన్ని పాత్రలూ సమానమే. ప్రతి పాత్ర నిజ జీవితంలో జరిగిందే కదా. అందుకే ఎవరి పరిధిలో వారు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సినిమాలో చెప్పుకోవాల్సింది స్నేహానికి వైఎస్సార్‌ ఎంత విలువ ఇచ్చారన్న పాయింట్‌ గురించి. ఆయన స్నేహితుడు కేవీపీ పాత్రలో రావురమేష్‌ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇప్పుడు నేను, రావు రమేష్‌ మంచి స్నేహితులుగా మారిపోయాం కూడా. సినిమాలో నన్ను చాలా సపోర్ట్‌ చేశారు.

తెలుగులో చాలా గ్యాప్‌ తర్వాత కనిపించారు. మళ్లీ ఎప్పుడు తెలుగు తెరపై మిమ్మల్ని చూడవచ్చు?
తెలుగులో నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. 

మలయాళీ మెగాస్టార్‌గా కాకుండా.. సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలు కేరళకు మాత్రమే పరిమితం చేశారు. మిగిలిన రాష్ట్రాలకు విస్తరిస్తారా?
అదేం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా సేవలందిస్తున్నాం. బాల కార్మికులకు విద్యనందించేందుకు స్ట్రీట్‌ ఇండియా మూమెంట్, పేదలకు ఉచిత క్యాన్సర్‌ చికిత్స అందించేందుకు పెయిన్‌ అండ్‌ పాలియేటివ్‌ కేర్‌ సొసైటీ పేరుతో కార్యక్రమాలు, ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ సేవా సంస్థ ఏపీలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

 350 సినిమాలు, 3 నేషనల్‌ అవార్డులు, 7 కేరళ ఫిల్మ్‌ అవార్డులు, 13 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, డాక్టరేట్‌లు, పద్మశ్రీ.. ఇలా మీ ప్రస్థానం సాగుతోంది. మీరెలా ఫీలవుతున్నారు.?
చాలా సంతోషంగా ఉంది. ఇది కొనసాగిస్తాను. నావరకూ నేను సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చెయ్యాలని అనుకుంటున్నాను.

‘యాత్ర’ సినిమా చూసిన వారు మమ్ముట్టి రాజ కీయాల్లోకి వస్తారని ఊహాగానాలు చేస్తున్నారు. ఇందులో నిజమెంత ఉంది?
సినిమాల్లో ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. వారిని ఆనందపరిచేందుకు నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు.

‘యాత్ర’ సినిమాపై కొంతమంది ప్రేక్షకుల స్పందన

నడుస్తున్న చరిత్ర
కథ మంచి ఎమోషనల్‌ టచింగ్‌గా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. మా ముందుకు మళ్లీ వైఎస్‌ఆర్‌ను తీసుకొచ్చారు. ఓ వైపు కన్నీళ్లు వస్తున్నాయ్‌.. మరోవైపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాం. నాలుగైదు సార్లు కళ్లు చెమర్చినా, అరె సినిమా అప్పుడే అయిపోయిందే! అనిపించింది. చరిత్ర సృష్టించిన ‘ఆరోగ్యశ్రీ’, రికార్డుకెక్కిన ‘ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌’, నేటికీ నిలిచిన ‘ఉచిత విద్యుత్‌’, ప్రాంతాల గతి మార్చిన ‘జలయజ్ఞం’...  ఇలా అయిదున్నరేళ్ల అభివృద్ధి – సంక్షేమం జోడు గుర్రాల స్వారీతో పాలన పరుగులెత్తించిన అన్ని పథకాలూ.. ‘పాదయాత్ర’లో ఎలా పురుడు పోసుకున్నాయో ఒడుపుగా తెరకెక్కించారు. అది ముగిసిన యాత్ర కాదు.. ‘నడుస్తున్న’ చరిత్ర. అందుకే తడుస్తున్న కళ్లతో ఆ చిత్రాన్ని చూస్తున్నాం.
– రామకృష్ణారెడ్డి, కాంతమ్మ దంపతులు, బెంగళూరు

వైఎస్సార్‌ వ్యక్తిత్వం తెలిసింది
రాజశేఖర రెడ్డి వలన అనేకమంది లబ్ది పొందారు. ఆయన్ను మరచిపోలేము. మహోన్నత నాయకుడు. ఆయన పాత్రలో మలయాళ నటుడు ముమ్ముట్టి ఒదిగిపోయారు. రాజశేఖర రెడ్డి అంటే మంచి పరిపాలకుడు, సంక్షేమ పథకాలకు ఆద్యుడు అని మాత్రమే మాకు తెలుసు. ‘యాత్ర’ సినిమా చూశాక ఆయన వ్యక్తిత్వం మాకు మరింత తెలిసింది. కష్టాలలో ఉన్నవారికి ధైర్యం ఇవ్వడం, వారికి అండగా ఉండడం, అధిష్టానాన్ని తనదైన శైలిలో ఎదిరించడం, మాట ఇచ్చాక దానికి కట్టుబడి ఉండడం ఒక ఎత్తు అయితే ‘యాత్ర’లో ముమ్ముట్టిని చూశాక రాజశేఖర రెడ్డిని మరోసారి చూసినట్లు అయ్యింది. ఆయన పదవిలోకి వచ్చాక ఆయన చేపట్టిన కార్యక్రమాలు మరింతగా చూపించాల్సింది. ఏది ఏమైనా ‘యాత్ర’ సినిమా రాజశేఖర రెడ్డిలోని అన్ని కోణాలను కళ్లకు కట్టినట్లు చూపారు. సినిమా సూపర్బ్‌.
– జుత్తాడ అరుణకుమారి, బొబ్బిలి

క్లైమాక్స్‌ కన్నీళ్లు తెప్పించింది
నేను, నా భర్త ‘యాత్ర’ సినిమా చూస్తున్న కొద్దీ తర్వాత ఏం జరుగుతుందోనన్న ఒక ఫీలింగ్‌ కలిగింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి చాలా అద్భుతంగా నటించారు. వైఎస్సార్‌ చేసిన నిజజీవితపు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వం రాగానే వాటిని అమలు చేస్తామన్న వాగ్దానాలు ‘యాత్ర’ సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చివరిలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన హెలికాప్టర్‌ సన్నివేశాలను చూపిస్తూ కన్నీళ్ళు తెప్పించారు. 
– ధర్మాన సుశ్రీ, శ్రీకాకుళం

అద్భుతంగా చూపించారు
‘యాత్ర’ సినిమాలో రాజశేఖర్‌రెడ్డి ప్రజా ప్రస్థాన యాత్రలో ఎదురైన అనుభవాలను చక్కగా చూపించారు. వాస్తవాలను తెరపైకి తీసుకొచ్చారు. డైర్‌క్షన్‌ అదుర్స్‌. స్క్రీన్‌ప్లే అద్భుతం. ఈ గడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది డైలాగ్‌ సూపర్‌. సినిమా ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంట తడితో బయటికి వస్తున్నారు. ‘యాత్ర’ సినిమాతో రాజశేఖర రెడ్డిని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు మళ్లీ రావాలని దేవుని కోరుకుంటున్నాం.  
– సాత్విక, చిత్తూరు 

ఆ తర్వాత మళ్లీ ‘యాత్ర’కే క్షీరాభిషేకాలు
20 సంవత్సరాలుగా సినిమా రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్నాను. మాతృదేవోభవ, అమ్మోరు చిత్రాల అనంతరం థియేటర్‌ల వద్ద మళ్లీ క్షీరాభిషేకాలు చూడటం జరిగింది. ‘మాతృదేవోభవ’లో ఆద్యంతం హృదయాన్ని పిండే సన్నివేశాలు చూసి, చెమర్చిన కళ్లతో ప్రేక్షకులు హాలు నుంచి బయటకు వచ్చేవారు. ఇప్పుడు మళ్లీ ‘యాత్ర’ సినిమా చూసి వందలాది మంది చెమర్చిన కళ్లతో సినిమా హాలు నుంచి బయటకు వచ్చి మహానేతను మననం చేసుకోవడం కనిపించింది. 
–  సోమరౌతు అప్పారావు, థియేటర్‌ రిప్రజెంటేటివ్, కొయ్యలగూడెం

హృదయాన్ని కదిలించే సినిమా
జన హృదయాలలోని సంఘర్షణలకు ప్రత్యక్ష రూపమిచ్చిన ‘యాత్ర’ సినిమా చూస్తున్నంత సేపూ వైఎస్సార్‌ నిజ జీవితంలో తిరుగాడినట్లుంది. వైఎస్సార్‌ పాత్రలో ముమ్ముట్టి జీవించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. హృదయాన్ని కదిలించే ఈ చిత్రంలోని సన్నివేశాలు చూస్తుంటే అడుగడుగునా మాకు జగన్మోహన్‌రెడ్డి ప్రసంగాలు విన్నట్టే అనిపించాయి. మా ఇంట్లో వారు పట్టుబట్టి చిత్రం చూశారు.  మొత్తం మీద జీవితం లాంటి సినిమాను చూశామన్న తృప్తి అందరికి కల్గుతుంది.
– కె.నరసింహారెడ్డి, ప్రయివేటు ఉద్యోగి, పుట్టపర్తి 

అందరూ ఫిదా 
రాజన్న నడకలోని రాజసం, మాటలోని గాంభీర్యం.. మనసులోని మర్మం.. సెల్యులాయిడ్‌పై నిలువెల్లా వ్యాపించింది. ‘యాత్ర’ చూశాను. ఇదొక ఎమోషనల్‌ జర్నీ. చాలా సందర్భాల్లో ఎమోషనల్‌ అయ్యాను. రాజన్నే స్వయంగా తెరపైకి వచ్చాడేమో అనేంతలా మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ‘యాత్ర’ నిజాయితీతో కూడిన భావోద్వేగాలతో సాగే చిత్రం. హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్‌ ఉంది. సినిమా చూసిన తర్వాత రాత్రంతా ఆ మహానేత ఆలోచనలే. ‘యాత్ర’లో భాగంగా వచ్చే ప్రతి సీన్‌ మనసును కదిలించేలా ఉంది. ఓ రైతు పండించిన టమాటాలు అమ్ముకోలేకపోవడం.. కనీసం చార్జీలు ఇవ్వలేని పరిస్థితి, వైద్యం అందక ఓ అమ్మాయి చనిపోయే సీన్స్‌ చూస్తే చాలా సిగ్గేసింది. ఇన్ని కష్టాలను చూసి ఆ మహానేత వారికి భరోసా కల్పించి.. వారికిచ్చిన హామీలను నెరవేర్చడం చాలా గొప్ప విషయం.
– సానికొమ్ము సుప్రియ, బెంగళూరు

జన్మ చరితార్థమైంది
‘యాత్ర’ సినిమా ఉచిత షోలను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నాను. మహానేతపై ఉన్న అభిమానంతో సినిమా హక్కులు కొనుగోలు చేయడమే కాక పేద మధ్య తరగతి ప్రజలు సైతం సినిమా చూడాలనే ఉద్దేశ్యంతో షోలను ఉచితంగా ప్రదర్శించి. జన్మను చరితార్థం చేసుకోగలిగాను. చిత్రాన్ని చూసిన ప్రతీ మహిళ, వృద్ధులు చెమర్చిన కళ్లతో మంచి చిత్రాన్ని చూపించి మాకు మళ్లీ మహానేతను మా ముందుంచావు అంటూ పేర్కొనడం గర్వకారణంగా భావిస్తున్నా.
– గంజిమాల దేవి, వైఎస్సార్‌ అభిమాని, కొయ్యలగూడెం, ప.గో.జిల్లా,

పాదయాత్రలో పాల్గొన్నట్లుగా ఉంది
ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన  తలపించడంతో అన్ని వర్గాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మహానేత వైఎస్‌ఆర్‌ ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా ప్రస్థాన ‘యాత్ర’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దిశానిర్దేశాన్ని మార్చేసేందుకు దోహదం చేసింది. ఆం్ర«ధప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్రను ‘యాత్ర’ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూశాం. ఈ సినిమా చూస్తుంటే మహానేత వైఎస్‌ఆర్‌ చేపట్టిన పాదయాత్రలో మొత్తం పాల్గొన్నట్లుగా ఉంది.  సినిమా అద్భుతం. మలయాళ ప్రముఖ సినీ హీరో మమ్ముట్టి యాక్టింగ్‌ అచ్చం వైఎస్‌ఆర్‌ తరహాలోనే ఉంది. ‘యాత్ర ’సినిమాలో ఆయన ప్రతిపక్ష నేత హోదాలో కాంగ్రెస్‌ హైకమాండ్‌తో ఎలా నడుచుకున్నది, రైతుల సమస్యలు ఎలా తెలుసుకున్నది, విద్యార్థుల సమస్యలను.. ఇలా చెప్పుకుంటే పోతే రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలో వైఎస్‌ఆర్‌ పడిన కష్టాలను మమ్ముట్టి ‘యాత్ర’ సినిమాలో చూశాం. నిజంగా ఇది యాత్ర సినిమా కాదు. మహానేత వైఎస్‌ఆర్‌ పాదయాత్రను, ఆయన వ్యవహారశైలిని దగ్గరగా చూసే అదృష్టం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
 – శ్రీనివాసరెడ్డి పాల్వాయ్, ఆర్‌.కే.ఆస్పత్రి, బళ్లారి, కర్ణాటక.

ప్రతి సీన్‌ బాగుంది
మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఏముంది...ముందుకు వెళ్లాల్సిందే అంటూ హైకమాండ్‌ను ధిక్కరించి చెప్పిన డైలాగ్‌ చాలా బాగుంది. అన్నింటికన్నా పెద్ద జబ్బు క్యాన్సరో...గుండె జబ్బో కాదయ్యా...పేదరికం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్‌ ఒకటేంటి.. ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిజజీవిత పాత్రలో మమ్ముట్టి జీవించేశారు. 
– తాన్న సునీల్‌కుమార్‌ (శ్రీకాకుళం–ఎచ్చెర్ల)

ప్రతి సీన్‌ బాగుంది
మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఏముంది...ముందుకు వెళ్లాల్సిందే అంటూ హైకమాండ్‌ను ధిక్కరించి చెప్పిన డైలాగ్‌ చాలా బాగుంది. అన్నింటికన్నా పెద్ద జబ్బు క్యాన్సరో...గుండె జబ్బో కాదయ్యా...పేదరికం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్‌ ఒకటేంటి.. ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిజజీవిత పాత్రలో మమ్ముట్టి జీవించేశారు. 
– తాన్న సునీల్‌కుమార్‌ (శ్రీకాకుళం–ఎచ్చెర్ల)

కళ్లకు కట్టినట్లు తీశారు
‘యాత్ర’ సినిమాలో రాజశేఖర రెడ్డిగారి పాద యాత్రను కళ్లకు కట్టినట్లు తీశారు. ఆయన నిజజీవితంలో జరిగిన ఎన్నో వాస్తవ సంఘటనలను యధావిదిగా చూపారు. రాజశేఖర రెడ్డి హావభావాలను అచ్చంగా అలానే ముమ్ముట్టి ప్రదర్శించారు. ఆయన నటన చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ‘యాత్ర’లో స్క్రీన్‌ప్లే బాగుంది. పాటలు ఇంకా ఉత్తేజంగా ఉంటే బాగుండేవి. రాజశేఖర రెడ్డి గొప్ప దార్శనికులు.ఆయన ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపారు. కానీ ఆయన కుటుంబం అనేక కష్టాలలో ఉంది. ‘యాత్ర’ సినిమా జగన్‌కు మేలు చేయాలని కోరుకుంటున్నాం.
– బిట్రా శ్రీనివాసరావు, బొబ్బిలి

రాజన్న పాత్రలో మమ్ముటి జీవించారు
‘యాత్ర’ చిత్రాన్ని సినిమా యూనిట్‌ అత్యద్భుతంగా తెరకెక్కించింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముటి జీవించారు. అధిష్టానాన్ని ఎదిరించే సన్నివేశం అద్భుతంగా ఉంది. నటీనటులు వారి వారి పాత్రకు న్యాయం చేశారు. ప్రతి సీన్‌ అభిమానులను కంట తడి పెట్టిస్తోంది. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు, వాటి గల కారణాలను సూటిగా చూపించారు. 
– రాజు, చిత్తూరు

మమ్ముట్టిని చూస్తున్న కొద్ది వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకొచ్చారు
‘యాత్ర’ సినిమా చూస్తున్న కొద్దీ మొదటి నుంచి చివరి వరకూ వైఎస్‌ రాజశేఖరరెడ్డినే చూసినట్లు అనిపించింది. రాజన్న రాజసం తెరమీద చూపించేందుకు డైరక్టర్‌ చేసిన ప్రయత్నం చాలా బాగుంది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌ను తెరమీద చూస్తున్న కొద్దీ  చాలా ఆనందంగా అనిపించింది. రాజశేఖర రెడ్డి నిజజీవితంలో ఎలా ఉండేవారు? అనేది ‘యాత్ర’ సినిమాను డైరక్టర్‌ ప్రేక్షకులకు అద్భుతంగా చూపించారు.  
– అక్కేన నరేష్‌. శ్రీకాకుళం 

– కరుకోల గోపీకిశోర్‌రాజా,  సాక్షి, విశాఖ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top