
సినిమా: విశ్వనటుడు కమలహాసన్‌కు సంచలన నటుడు శింబు మనువడుగా మారనున్నాడా? ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. కమలహాసన్ తన మక్కళ్ నీది మయ్యం పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన చివరి చిత్రం ఇండియన్–2కు సంబంధించిన పనుల్లో మునిగిపోయారు. 1996లో కమలహాసన్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇండియన్. శంకర్ దర్శకత్వం వహించిన ఇది లంచగొండితనంపై ఆయన ఎక్కుపెట్టిన బాణం. సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో శంకర్ రజనీకాంత్‌తో ఎందిరన్‌కు సీక్వెల్‌గా 2.ఓ చిత్రం చేశారు. ఇప్పుడు ఇండియన్‌కు సీక్వెల్‌ను చేసే పనిలో నిమగ్నమయ్యారు.
సుమారు 22 ఏళ్ల తరువాత ఇండియన్‌కు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ఇందులో కమల్ మళ్లీ తండ్రీ కొడుకులుగా నటించనున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఆయనకు మనువడిగా శింబు నటించనున్నారనే ప్రచారం మాత్రం హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా శంకర్ తన చిత్రాలకు సంబంధించిన విషయాల్లో చాలా సీక్రెట్‌ను మెయిన్‌టెన్ చేస్తుంటారు. అలాంటిది ఇండియన్–2కు సంబంధించి చాలా లీక్‌లు వస్తున్నాయి. ఇందులో నటి కాజల్‌అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుంది. ఆమె కమల్‌హాసన్‌కు జంటగా నటించనుందని, దీంతో కాజల్‌లగర్వాల్ శింబుకు పోటీగా మారనుందనే వార్తలు కోలీవుడ్ ఆమెపై వస్తున్నాయి. ఇండియన్–2 చిత్రం ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉందని, కొన్ని అనివార్యకారణాల వల్ల ఆలస్యం జరిగిందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ నెలాఖరున చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారికపూర్వ ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. శింబు ప్రస్తుతం వందా రాజావాదాన్ వరువేన్ చిత్రాన్ని పూర్తి చేసి త్వరలో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాదు చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.