అవును పురుషాధిక్యమే!

Shriya Saran React On Male Domination In Film Industry - Sakshi

తమిళసినిమా: అవును ఇక్కడ పురుషాధిక్యమే కొనసాగుతోందని నటి శ్రియ వక్కాణించారు. సినీ పరిశ్రమలో పురుషాధిక్యంపై కొందరు కథానాయికలు అప్పుడప్పుడూ గొంతెత్తుతుంటారు. అయితే వారిలో బిజీ హీరోయిన్ల కంటే సీనియర్‌ హీరోయిన్లే తన అనుభవంలో భాగంగా పురుషాధిక్యంపై తమ అక్కసును వెళగక్కుతుంటారు. అలాంటి వారిలో నటి శ్రియ చేరారు. గత దశాబ్దంన్నరగా దక్షిణాదిలో నటిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీ ఇటీవల రష్యాకు చెందిన బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా, చాలా సింపుల్‌గా పెళ్లి చేసేసుకున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో, అప్పుడప్పుడూ హిందీలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామకు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. అదే విధంగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు ఒకటి రెండు చేసినా అవి పెద్దగా సక్సెస్‌ అవకపోవంతో ఆవిధంగా శ్రియ రాణించలేకపోయారు. ఇకపోతే కోలీవుడ్‌లో శింబుతో నటించిన అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రం తరువాత ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు.

అరవింద్‌స్వామికి ప్రతినాయకిగా నటించిన నరకాసురన్‌ చిత్రం ఒక్కటే విడుదల కావలసి ఉంది. ఇక తెలుగులోనూ అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అవ్వాలని భావించిన శ్రియ పెళ్లి చేసుకున్నారు. అనంతరం రష్యాలో సెటిల్‌ అవనున్నట్లు ప్రచారం జరిగినా మళ్లీ నటించడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో ఒక చిత్రం కమిట్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చారు. సమీప కాలంలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రియ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఒక చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు చెప్పారు. తనకు ఇప్పటికి చాలా అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అయితే కథలు నచ్చకపోవడం నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అన్ని చిత్రాల్లోనూ పురుషాధిక్యం ఎక్కువ అని అన్నారు. కథానాయిక పాత్రల పరిధి తక్కువగానే ఉంటుందని, అదీ చిత్రం పూర్తి అయ్యేసరికి ఇంకా తగ్గిపోతోందని ఆరోపించారు. మరో విషయం ఏమిటంటే తనకు తమిళంలో కంటే తెలుగులోనే మంచి కథా పాత్రలు లభిస్తున్నాయని శ్రియ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top