నిజమైన కత్తితోపొడిచేసింది!

నిజమైన కత్తితోపొడిచేసింది!


ఒక్కోసారి సినిమా షూటింగుల్లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఇటీవల ‘ఏక్ విలన్’ సినిమా షూటింగులో ఇలాంటి పొరపాటే ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,  ప్రధాన తారాగణమైన శ్రద్ధాకపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ పాల్గొనగా కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మోహిత్ సూరి. అవసరార్థం కొన్ని నకిలీ ఆయుధాలను కూడా తెప్పించారు. అయితే... ఆ నకిలీ ఆయుధాల మధ్య నిజమైన ఆయుధం కూడా ఒకటి ఉంది.అది తెలీని శ్రద్ధాకపూర్... ఆ నిజమైన ఆయుధాన్నే చేతిలో పట్టుకొని, ఎదురుగా ఉన్న స్టంట్‌మేన్‌తో సరదాగా యుద్ధ విన్యాసం చేయడం మొదలుపెట్టింది. అది నకిలీ ఆయుధమే అనుకొని ఆ స్టంట్‌మెన్‌ని గట్టిగా పొడిచేసింది. ఇంకేముంది... క్షణాల్లో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. లొకేషన్ మొత్తం గందరగోళం. తీవ్రంగా గాయపడ్డ ఆ స్టంట్‌మేన్‌ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇక శ్రద్ధాకపూర్ అయితే... కళ్ళ ముందు ఏం జరుగుతోందో తెలియనంత షాక్‌లోకి వెళ్లిపోయింది. అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అనే వార్త చెవిన పడే వరకూ ఆమె మనిషి కాలేదు. ఎట్టకేలకు ఆ స్టంట్ మేన్‌కు ప్రమాదం తప్పడంతో యూనిట్ మొత్తం ఊపిరి పీల్చుకుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top