
‘స్త్రీ 2’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించనున్న సినిమాపై అతి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విక్కీ కౌశల్‌తో ‘ఛావా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో శ్రద్ధా కపూర్ నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయని, ఈ చిత్రంలో క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో శ్రద్ధా కపూర్ నటించనున్నారని టాక్.
నవంబరులో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట దర్శకుడు లక్ష్మణ్. మరోవైపు ఈ సినిమా కోసం ప్రస్తుతం శ్రద్ధగా క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకునే పనిలో ఉన్నారట శ్రద్ధా కపూర్. మహారాష్ట్ర చరిత్ర, సంస్కృతిని చాటి చెప్పేలా ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని ఈ చిత్రనిర్మాత దినేష్ విజన్ ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది.