రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

Seeman Questions Why Rajini Featured in School Text Book - Sakshi

పాఠ్యపుస్తకాల్లో రజనీకాంత్‌ జీవితానికి సంబంధించిన అంశాలను చేర్చడంపై సినీ దర్శకుడు, నామ్‌ తమిళర్‌ పార్టీ అధినేత సీమాన్‌ విమర్శలు గుప్పించారు. శనివారం ఉదయం నెల్లై జిల్లా పాలైయకోటైట జ్యోతిపురంలో నామ్‌ తమిళర్‌ పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ నటుడు రజనీకాంత్‌కు సంబంధించిన అంశాలను ప్రభుత్వం ఐదవ తరగతి పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడాన్ని సీమాన్‌ తీవ్రంగా విమర్శించారు.

సినీరంగంలో విజయాలు సాధించిన వారి గురించి పాఠ్య పుస్తకాల్లో పొందుపరచడం సరైన చర్య కాదన్నారు. అలా చూస్తే రజనీకాంత్‌ కంటే కమల్‌హాసనే ఎంతో సాధించారని పేర్కొన్నారు. అయినా కళారంగంలో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారన్నారు. ప్రపంచ స్థాయిలో ఖ్యాతిగాంచిన సుందరపిళ్లై కూడా శ్రమతో విజయం సాధించిన వారేనని అన్నారు.

అలాంటిది రజనీకాంత్‌ను పాఠ్య పుస్తకాల్లో కీర్తించడం ఆక్షేపించదగ్గ విషయంగా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న నడిగర్‌సంఘం ఎన్నికల గురించి మాట్లాడుతూ.. అధ్యక్షపదవికి దర్శకనటుడు కే.భాగ్యరాజ్‌ పోటీ చేయడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు బాధ్యతలను సరిగా నిర్వహించలేకపోయారని అన్నారు. సర్కార్‌ చిత్ర సమస్య విషయంలో దర్శకుడు కే.భాగ్యరాజ్‌ సరైన విదంగా స్పందించారని సీమాన్‌ ప్రశంసించారు. కే.భాగ్యరాజ్‌ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top