ఇంటర్‌ కూడా పూర్తి చేయని సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు

Ram Pothineni Birthday Wishes For Sachin Goes Viral - Sakshi

హీరో రామ్‌ ఆసక్తికర ట్వీట్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యామనే బాధతో 18 మంది అమాయక విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇంటర్‌ బోర్డ్‌ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలక్ష్యంతో అమాయక పిల్లలు పిట్టల్లా రాలుతున్నారు. ఈ బలవన్మరణాలను చూసి చలించిపోయిన టాలీవుడ్‌ హీరో రామ్‌పోతినేని ఆసక్తికరంగా ట్వీట్‌ చేశారు. ‘ఇంటర్‌ ఫలితాలే జీవితం అనుకునే తమ్ముళ్లకు.. చెల్లెళ్లకు మీరు జీవితంలో అవ్వబోయేదానికి. చేయబోయేదానికి ఇది--తో సమానం. దయచేసి లైట్‌ తీసుకొండి. ఇట్లు ఇంటర్‌ కూడా పూర్తి చేయని మీ రామ్‌పోతినేని’ అంటూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా మరో ట్వీట్‌లో.. భారత క్రికెట్‌ దిగ్గజం.. క్రికెట్‌ దేవుడిగా పిలుచుకునే  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఇంటర్‌ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ పార్క్‌లో కూర్చొని బిస్కట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. కానీ బెడ్‌ రూంలో లాక్‌ వేసుకుని జీవితం ఎలారా అనుకునే పిల్లలకు నిజాలు ఇలా చెబితేనే వింటారు.. ఇంటర్‌ కూడా పూర్తి చేయని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’  అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్లకు #InterBoardMurders అనే యాష్‌ ట్యాగ్‌ను జతచేశాడు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్వీట్లు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం రామ్‌ పొతినేని డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీజగన్నాథ్‌తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్వీట్స్‌ డైలాగ్స్‌ కూడా పూరి శైలిలోనే ఉన్నాయని, ఆయనకు బాగా కనెక్ట్‌ అయ్యారని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్‌ తప్పితే.. మళ్లీ సప్లమెంటరీ పరీక్ష ఉందని, ఫెయిల్‌ అయినంత మాత్రానా జీవితం కోల్పోలేదని సూచిస్తున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో మంచి పొజిషన్‌లో రాణిస్తున్న వారంతా ఏదో ఒక పరీక్షల్లో ఫెయిలైనవారేనని, అందరు అత్తెసరు మార్కులతో పాసైనవారేనని కామెంట్‌ చేస్తున్నారు. ఇక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1973 ఏప్రిల్‌ 24న జన్మించిన సచిన్‌కు నేటితో 46 ఏళ్లు నిండాయి. సచిన్ పుట్టినరోజు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. 

దేశానికి 24 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఈ మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌... ఆ క్రమంలో టెస్టులు (200 మ్యాచ్‌లు–15,921 పరుగులు), వన్డేల్లో (463 మ్యాచ్‌లు–18,426 పరుగులు) అత్యధిక పరుగుల ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులు తిరగ రాశాడు. 2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తూనే... దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్నాడు. దీనికిముందే 1994లో అర్జున అవార్డు, 1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్‌ పురస్కారాలను పొందాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచ కప్‌లలో పాల్గొన్న సచిన్‌... 2011లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడిగా తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top