ఆ టోపీనేను ‘టామీ’ కోసం కొన్నా!

ఆ టోపీనేను ‘టామీ’ కోసం కొన్నా!


 ‘‘అప్పుల అప్పారావులు, లేడీస్ టైలర్లు, మిస్టర్ పెళ్లాంలు.. సమాజంలో ఉన్నవాళ్లే. ఇవన్నీ కామన్ మ్యాన్ పాత్రలే కాబట్టి,

 నేను అందరికీ దగ్గరయ్యాను. అందరూ ఎంజాయ్ చేసే చిత్రాలు చేస్తున్నాను కాబట్టి, వన్నీ ‘సర్వీస్ ఓరియంటెడ్ మూవీస్’ అంటాన్నేను. ‘టామీ’ కూడా ఆ జాబితాలో చేరుతుంది’’ అంటున్నారు డా. రాజేంద్రప్రసాద్. ఆయన హీరోగా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో హరిరామ జోగయ్య, బోనం చినబాబు నిర్మించిన ‘టామీ’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ చెప్పిన విశేషాలు...


 

 ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’లో గజరాజు కాంబినేషన్లో.. ఇప్పుడేమో కుక్కపిల్లతో నటించారు. ఎలా అనిపిస్తోంది?

 చిన్నపిల్లలతో, మూగజీవాలతో నటించడం అనేది ప్రాప్తం అనిపిస్తోంది. చిన్న పిల్లలకు, పెంపుడు జంతువులకు ఏమీ తెలియదు. అందుకే ఈ కాంబినేషన్స్‌ను చాలా ఎంజాయ్ చేస్తాను. పైగా, మూగజీవాల కాంబినేషన్‌లో నటించే అవకాశం ఎక్కువగా నాకే దక్కింది. అందుకే ‘మనమేమన్నా గత జన్మలో జంతువా? అందుకే ఈ జన్మలో మూగజీవాలతో ఇలా అనుబంధం ఏర్పడిందా?’ అని అప్పుడప్పుడూ సరదాగా అనుకుంటాను.

 

 సినిమాలో టామీతో మీకు మంచి అనుబంధం ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా ఆ కుక్కపిల్లపై మీకు అంతే ప్రేమ ఉండేదా?

 కచ్చితంగా ఉండేది. ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ అప్పుడు 40 రోజులు షూటింగ్ చేశాం. ఆ 40 రోజుల్లోనే గజరాజు మీద మమకారం ఏర్పడింది. ఇప్పుడు టామీతో 25 రోజులు షూటింగ్ చేశాం. సినిమా పూర్తయ్యేసరికి, అది నా మీద పడి నా మూతి నాకేసేంతగా దగ్గరైపోయింది. దాన్ని ఏదో జన్మలోనో కని, పెంచకుండా వదిలేశానేమో.. అందుకే, ఇప్పుడు దగ్గరైంది అనిపించింది. టోటల్‌గా ‘టామీ’ చిత్రం నటుడిగా కన్నా ఒక వ్యక్తిగా నాకో మంచి అనుభవం. ‘టామీ’ చూశాక చాలామంది తమ ఇంట్లో కుక్కపిల్లల్ని తెచ్చిపెట్టుకున్నారని తెలిసి, ఆనందపడ్డాను. సినిమా చూసినవాళ్లందరూ ‘మంచి సినిమా చూశాం. మనసు నిండిపోయిం’ దంటున్నారు. అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?

 

 మొత్తం మీద ‘టామీ’ని బాగా ఇష్టపడినట్లున్నారు?

 చాలా. ఈ చిత్రం చేస్తున్నప్పుడు ఓ పని మీద అమెరికా వెళ్లాను. మామూలుగా విదేశాలు వెళ్లినప్పుడు అక్కడ దొరికే కొత్త వస్తువులేమైనా కొంటుంటాను. కానీ, ఈసారి అలా చేయలేదు. ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లా, అక్కడ ఉన్న ఒక చిన్న షాప్‌లో టోపీల మీద పేర్లు వేస్తున్నారు. అప్పటికి రాత్రి తొమ్మిదయ్యింది. మరో గంటలో కొట్టు కట్టేస్తారనగా, నాకు నాలుగు టోపీల మీద పేర్లు వేసివ్వమన్నాను. ‘టామీ డెరైక్టర్’, ‘టామీ ప్రొడ్యూసర్’.. ఇలా కొన్ని టోపీలు తయారు చేయించాలన్నది నా ఫీలింగ్. ఆ రెండు టోపీలు రెడీ అయిన తర్వాత ‘టామీ హీరో’ అని పేరు వేయమన్నాను. ఆ పేరు వేసేటప్పుడు నాలుగుసార్లు సూది విరిగిపోయింది. ‘ఇక నా వల్ల కాదు’ అని అతను చేతులెత్తేస్తే, అతని కూతురు చేసి, ఇచ్చింది. నేనా టోపీలు తీసుకొచ్చి, దర్శక, నిర్మాతలకు, ఇతరులకు పెట్టాను. ‘హీరో’ అని ఉన్న టోపీని నాకు పెట్టబోతుంటే, వద్దంటూ, దాన్ని మా కుక్కపిల్ల టామీకి పెట్టాను. దాన్నిబట్టి దాంతో నా అనుబంధం ఎలాంటిదో ఊహించవచ్చు.

 

 టామీ బాగా నటించింది కదా... మిమ్మల్ని డామినేట్ చేసినట్లు అనిపించిందా?

 టామీకి దెబ్బ తగిలినప్పుడు అదీ, నేనూ ఆస్పత్రికి పరుగెత్తికెళతాం. క్లోజప్ షాట్స్‌లో మేం ఓ లుక్ ఇవ్వాలి. ఆ క్లోజప్‌లో దానికి ఎక్కువ మార్కులు పడతాయేమో అని కడుపు మండిపోయింది (నవ్వుతూ). దాని మీద విపరీతమైన ప్రేమతో కూడిన కుళ్లు ఏర్పడింది. ఈ సినిమా చేసిన 25 రోజులూ 25 సెకన్లలా గడిచిపోయాయనిపించింది.

 

 ‘జులాయి’ తర్వాత మళ్లీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సన్నాఫ్ సత్యమూర్తి’ చేయడం?

 మామూలుగా కమర్షియల్ సినిమాలను పిల్లలు పెద్దగా ఇష్టపడరు. కానీ, ‘జులాయి’ చిత్రాన్ని పిల్లలు కూడా చూసేలా త్రివిక్రమ్ తీశారు. మరీ.. ముఖ్యంగా నా పాత్రను పిల్లలు బాగా ఇష్టపడ్డారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ని త్రివిక్రమ్ అంతకు మూడు, నాలుగు రెట్లు బాగా తీశారు. బన్నీకి నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవలే నా పాత్రకు డబ్బింగ్ చెప్పా. సూపర్ మూవీ.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top