ఈ విజయంతో ఓ దారి వేయాలనుకుంటున్నాం – ‘దిల్‌’ రాజు | Raja The Great Theatrical Trailer Release friday | Sakshi
Sakshi News home page

ఈ విజయంతో ఓ దారి వేయాలనుకుంటున్నాం – ‘దిల్‌’ రాజు

Oct 7 2017 1:39 AM | Updated on Oct 7 2017 1:40 AM

Raja The Great Theatrical Trailer Release friday

‘‘దిల్‌’ రాజుతో సినిమా చేసి 13 ఏళ్లైంది. కొంచెం లేటయినప్పటికీ... మంచి సినిమా చేశాం. విపరీతమైన క్లారిటీ ఉన్న దర్శకుడు అనిల్‌. మోస్ట్‌ పాజిటివ్‌ పర్సన్‌! అందర్నీ నవ్విస్తూ హుషారుగా వర్క్‌ చేస్తాడు. తను చేసినదాంట్లో నేను 50 శాతం చేస్తే... మంచి పేరొస్తుందని నా స్ట్రాంగ్‌ ఫీలింగ్‌. ఈ సిన్మాతో అనిల్‌కి హ్యాట్రిక్‌ హిట్‌ వస్తుంది’’ అన్నారు రవితేజ. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ‘రాజా ది గ్రేట్‌’ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

రవితేజ మాట్లాడుతూ– ‘‘మాతో పాటు శిరీష్‌ ఈ సినిమాకి దగ్గరుండి వర్క్‌ చేశారు. అంతకుముందు ఆయనతో నాకంత ఇంట్రాక్షన్‌ లేదు. రాధిక, రాజేంద్రప్రసాద్, పోసానిగార్లతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సూపర్‌. వాళ్లతో పాటు శ్రీనివాసరెడ్డి బాగా నటించారు. మెహరీన్‌కి కూడా ఈ సినిమా హ్యాట్రిక్‌ అవుతుంది. ఎడిటర్‌ తమ్మిరాజు, డీఓపీ మోహన్‌కృష్ణ, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌లతో ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేశా. వాళ్లందరూ ఈ సిన్మాతో నెక్ట్స్‌ లెవల్‌కి వెళతారని అనుకుంటున్నా’’ అన్నారు.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్‌ కథ చెప్పగానే, రవితేజ నాకు ఫోన్‌ చేసి... ‘దర్శకుడు నా ముందు చేసినట్టు నేను సినిమాలో చేస్తే చాలు’ అన్నారు. అన్నట్టుగానే అద్భుతంగా నటించాడు. రవితేజ నటనే సినిమా సక్సెస్‌కి ముఖ్య కారణమవుతుంది. వెంకటేశ్వరస్వామి దయ వల్ల హిట్స్‌లో ఉన్న మా సంస్థకి మరో హిట్‌ అందించేలా ఉన్నాడు అనిల్‌. దీపావళికి తమిళంలో, హిందీలో పెద్ద సినిమాలు విడుదలవుతాయి. తెలుగులో మాత్రం పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తారు. దాన్ని బ్రేక్‌ చేయాలి.

మనకు సంక్రాంతి, ఉగాది, దసరా ఎలాగో... దీపావళి అలాగే కావాలని ప్రయత్నిస్తున్నాం. మా సినిమా విజయంతో తెలుగులో పెద్ద సినిమాల విడుదలకు ఓ దారి వేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మంచి పేరొచ్చే మంచి సినిమా చేస్తున్నామనే ఫీల్‌ను ‘రాజా... ది గ్రేట్‌’ స్టార్టింగ్‌ నుంచి ఎంజాయ్‌ చేస్తున్నా. రవితేజగారికి 20 నిమిషాలు కథ చెప్పిన తర్వాత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంధుడైన తన కుమారుణ్ణి గుడ్డిగా నమ్మే అమ్మ పాత్రలో రాధికగారు నటించారు. సినిమాకి సెంటర్‌ పాయింట్‌ అదే. అంతే గుడ్డిగా రవితేజగారు నన్ను నమ్మారు.

ఆయన నమ్మకమే నా బలం. ‘దిల్‌’ రాజుగారు హెడ్‌ మాస్ట్టర్‌లా పాజిటివ్‌ గైడెన్స్‌తో మమ్మల్ని ప్రొత్సహించారు. దీపావళికి థియేటర్‌లో బిట్‌ సాంగ్‌తో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తాం’’ అన్నారు అనిల్‌ రావిపూడి. ‘‘కళ్లుండి గుడ్డివాడిలా నటించడం చాలా కష్టం.

కానీ, రవితేజగారు సూపర్‌గా నటించారు. పదిమంది సురేశ్‌బాబులు, పదిమంది ‘దిల్‌’ రాజులు ఉంటే తెలుగు చిత్రసీమ ఇండియాలో వన్నాఫ్‌ ది బెస్ట్‌ ఇండస్ట్రీ అవుతుంది’’ అన్నారు పోసాని. ‘‘ఓ అంధుడిపై ఇంత కమర్షియల్‌ సిన్మా రావడం గ్రేట్‌. నా లైఫ్‌లో మర్చిపోలేని సినిమాల్లో ఇదొకటి అవుతుందని గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నా’’ అన్నారు రాజేంద్రప్రసాద్‌. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ మెహరీన్, నటుడు శ్రీనివాసరెడ్డి, స్వరకర్త సాయికార్తీక్, డీఓపీ మోహన్‌కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement